Studio18 News - తెలంగాణ / : ఎస్సీ వర్గీకరణ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాప్యం చేస్తున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. అందరికంటే ముందే సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన ముఖ్యమంత్రి... అమలు చేయడంలో మాత్రం ఎందుకు శ్రద్థ చూపించడం లేదో అర్థం కావడం లేదన్నారు. సుప్రీంకోర్టు ఆగస్ట్ 1న ఇచ్చిన ఎస్సీ వర్గీకరణ తీర్పునకు విరుద్ధంగా ముఖ్యమంత్రి వ్యవరిస్తున్నారని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణ చేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని సుప్రీం కోర్టు చెప్పిందని గుర్తు చేశారు. ఆ తీర్పు వెలువడిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి స్పందించారన్నారు. ముఖ్యమంత్రి ఇటీవల డీఎస్సీ ఫలితాలు విడుదల చేశారని, 9వ తేదీన నియామక పత్రాలు ఇస్తామని చెబుతున్నారని పేర్కొన్నారు. వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత డీఎస్సీ పరీక్షలు జరిగాయని, వాటి విషయంలో వేగం ప్రదర్శించిన రేవంత్ రెడ్డి వర్గీకరణ విషయంలో మాత్రం ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారని నిలదీశారు. చట్టసభలో ఇచ్చిన మాటకు విరుద్ధంగా ముందుకు సాగుతున్నారని ఆరోపించారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత పంజాబ్, తమిళనాడు రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తున్నాయన్నారు. రాష్ట్రంలో కమిటీ వేసి అనంతరం అమలు చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పటి వరకు ఈ విషయంపై ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదని నిలదీశారు. అధిష్ఠానం ఒత్తిడి ఒకవైపు , ఇంకోవైపు రాష్ట్రంలో మాలల ఒత్తిడి వల్ల వర్గీకరణ అమలుకు వెనుకాడుతున్నారని ఆరోపించారు. జాప్యాన్ని నిరసిస్తూ ఈ నెల 9న అన్ని జిల్లాల్లో నల్ల జెండాలతో నిరసన తెలుపుతామన్నారు.
Admin
Studio18 News