Studio18 News - తెలంగాణ / : Hydra More Powerful : హైడ్రాకు విస్తృత అధికారాలు కల్పించింది తెలంగాణ ప్రభుత్వం. హైడ్రా కోసం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కు గవర్నర్ వర్మ ఆమోద ముద్ర వేశారు. ఇకపై హైడ్రా చేపట్టబోయే అన్ని కార్యకలాపాలకు చట్టబద్ధత లభించడంతో పాటు రక్షణ ఉంటుంది. ఈ ప్రత్యేక ఆర్డినెన్స్ ను 6 నెలలలోపు అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి చట్టం చేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. అప్పటివరకు హైడ్రాకు గవర్నర్ ఆమోదించిన ఈ ప్రత్యేక ఆర్డినెన్స్ రక్షణగా ఉండబోతోంది. మొన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆమోదించిన హైడ్రా ఆర్డినెన్స్ పై గవర్నర్ వర్మ పలు సందేహాలు వ్యక్తం చేయగా.. వాటిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడంతో గవర్నర్ ఆమోదించారు. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ లోని చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ స్థలాలు, ప్లే గ్రౌండ్స్ సహా ప్రభుత్వ ఆస్తులను సంరక్షించడం, ప్రకృతి వైపరిత్యాల సమయంలో రక్షణ చర్యలు, భారీ వర్షాలు సంభవించినప్పుడు ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకుని క్రమబద్దీకరించడం, అగ్నిమాపక శాఖ సేవలకు సంబంధించి ఎన్ ఓసీల జారీ తదితర లక్ష్యాలతో జూలై 19న జీవో నెంబర్ 99 ద్వారా తెలంగాణ ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్ గిరి జిల్లాల పరిధిలో ఔటర్ రింగ్ రోడ్ వరకు ఉన్న ప్రాంతాన్ని హైడ్రా పరిధిలోకి తీసుకొచ్చింది రేవంత్ ప్రభుత్వం. ఈ క్రమంలో రంగంలోకి దిగిన హైడ్రా ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ అక్రమ నిర్మాణాలను నేల కూలుస్తూ వస్తోంది. అయితే, పలువురు వ్యక్తులు హైడ్రాను అధికారులను సవాల్ చేస్తూ కోర్టులను ఆశ్రయిస్తుండడంతో న్యాయపరమైన చిక్కులు ఎదురవుతున్నాయి. హైడ్రాకు భవిష్యత్తులో న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా మరిన్ని అధికారాలు కట్టబెట్టడంలో భాగమైన ఈ స్పెషల్ ఆర్డినెన్స్ ను తీసుకొచ్చింది ప్రభుత్వం. ఈ క్రమంలో ఇకపై ఆక్రమణలను పరిశీలించడం, నోటీసులు ఇవ్వడం, ప్రభుత్వ స్థలాల్లోని ఆక్రమణల తొలగింపు అధికారం కల్పించే జీహెచ్ఎంసీ చట్టం 1955లోని సెక్షన్ 374 బి ని ఆర్డినెన్స్ లో చేర్చారు.
Admin
Studio18 News