Studio18 News - TELANGANA / HYDERABAD : ప్రేమించిన యువకుడు వివాహానికి నిరాకరించడంతో ఓ ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కుత్బుల్లాపూర్ మండలం వెన్నెలగడ్డలో ఓ ప్రైవేటు హాస్టల్ లో ఉంటూ ఫార్మసీ చదువుతున్న విద్యార్ధిని ప్రియాంక (26) హాస్టల్ గదిలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. హాస్టల్ సిబ్బంది, సహచర విద్యార్థినులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హాస్టల్ గదిలో పరిశీలన చేయగా, ఒక సూసైడ్ నోట్ లభ్యమైంది. అందులో ప్రేమించిన రవికుమార్ తనను పెళ్లి చేసుకోవడం లేదని, ఈ విషయంలో తీవ్ర మనస్తాపానికి గురై తాను ప్రాణాలు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు ప్రియాంక పేర్కొంది. ప్రేమ వ్యవహారమే ఈ దారుణ నిర్ణయానికి కారణమని సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు భావిస్తున్నారు. ప్రియాంక కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Admin
Studio18 News