Studio18 News - TELANGANA / ADILABAD : మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని సీఎస్పీ రోడ్డుకు చెందిన ఒక విద్యార్థి పదో తరగతి పరీక్షల ఒత్తిడి మరియు తాను సరిగ్గా చదవలేకపోతున్నాననే ఆవేదనతో ఆత్మహత్య చేసుకున్న సంఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు మరియు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, క్యాతన సత్యనారాయణ కుమారుడు క్యాతన్ తనై (16) సింగరేణి హైస్కూల్‌లో పదో తరగతి చదువుతున్నాడు. ప్రస్తుతం వార్షిక పరీక్షలు దగ్గరపడుతుండటంతో అతడు తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యాడు. ఎంత చదివినా తనకు మార్కులు రావేమోనని, కేవలం పాస్ మార్కులు మాత్రమే వస్తాయేమోనని గత కొద్ది రోజులుగా తన తల్లిదండ్రుల వద్ద ఆవేదన వ్యక్తం చేసేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున సుమారు ఉదయం 05:48 గంటలకు తండ్రి సత్యనారాయణ తనైను నిద్రలేపి చదువుకోమని చెప్పి వెళ్లారు. అయితే సుమారు 06:45 గంటల సమయంలో కుటుంబ సభ్యులు బయటకు వచ్చి చూడగా ఇంటి ముందున్న రేకుల షెడ్డు ఇనుప పైపుకు తనై నైలాన్ తాడుతో ఉరివేసుకుని కనిపించాడు. హుటాహుటిన కిందకు దించి చూడగా అప్పటికే అతడు మృతి చెందినట్లు తెలిసింది. సంఘటన స్థలంలో ఒక సూసైడ్ నోట్ (చిత్తు కాగితం) లభ్యమైంది. అందులో “సారీ మమ్మీ, ఐ లవ్ యు డాడీ, సారీ శ్రీనిధి” అని రాసి ఉంది. చదువు విషయంలో పడుతున్న మానసిక ఆందోళన వల్లే తన కుమారుడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని మృతుని తండ్రి సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Admin
Studio18 News