Studio18 News - తెలంగాణ / : Telangana Ministers visit Seoul : మూసీ పునరుజ్జీవ పథకంలో భాగంగా తెలంగాణ మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ, పలువురు ఎమ్మెల్యేలు, అధికారుల బృందం దక్షిణ కొరియా రాజధాని సియోల్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా సోమవారం సియోల్ లో చుంగేచాన్ తీరాన్ని, వ్యర్థాల నుంచి విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్న కేంద్రాలను బృందం సందర్శించింది. ఒకప్పుడు మురికి కూపంలా ఉన్న చుంగేచాన్ ఉపనదిలో ఇప్పుడు శుభ్రమైన నీరు ప్రవహిస్తోంది. ఇదే తీరులో హైదరాబాద్ లోని మూసీని పునరుజ్జీవం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇవాళ (మంగళవారం) దక్షిణ కొరియాలోని ముఖ్యమైన హన్ నది పునరుజ్జీవన ప్రాజెక్ట్ ను తెలంగాణ ప్రతినిధుల బృందం సందర్శించనుంది. సియోల్ నగరంలో నీటి సరఫరా, పర్యావరణం, ఆర్థిక వ్యవస్థకు కీలకంగా హన్ నది ఉంది. కాలుష్యానికి గురైన హన్ నదిని దక్షిణ కొనియా ప్రభుత్వం శుభ్రపరిచి పునరుద్దరించింది. 494 కిలో మీటర్లు మేర ప్రవహిస్తున్న హన్ నది.. సియోల్ నగరంలో 40 కిలో మీటర్లు మేర ప్రవహిస్తుంది. నది ప్రక్షాళన తరువాత శుభ్రంగా మారింది. ఇప్పుడు సియోల్ నగరానికి ఒక ముఖ్యమైన పర్యటక ప్రదేశంగానూ హన్ నది మారింది. ఈ క్రమంలో సియోన్ లో పర్యటిస్తున్న తెలంగాణ ప్రతినిధుల బృందం ఇవాళ హన్ నదిని సందర్శించనున్నారు.
Admin
Studio18 News