Studio18 News - తెలంగాణ / : హైదరాబాద్ నగరంలోని మియాపూర్‌లో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని దారుణ హత్యకు గురైంది. ఆమె ఇంట్లోనే గుర్తు తెలియని దుండగులు పదునైన ఆయుధంతో పొడిచి చంపేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. స్థానిక దీప్తిశ్రీనగర్ సీబీఆర్ ఎస్టేట్ 3ఏ బ్లాక్‌లో బండి స్పందన (29) అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని తన తల్లి నమ్రతతో కలిసి నివాసం ఉంటోంది. తల్లి ఓ ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గా పని చేస్తోంది. సోమవారం తల్లి తాను పనిచేస్తున్న పాఠశాలకు వెళ్లగా స్పందన ఇంట్లోనే ఉంది. ఈ క్రమంలో మధ్యాహ్నం సమీపంలో నివాసం ఉండే స్పందన సోదరి వచ్చి ఇంటి తలుపు కొట్టింది. కానీ తీయకపోవడంతో వెళ్లిపోయింది. ఇక సాయంత్రం స్కూల్ నుంచి తిరిగి వచ్చిన తల్లి కాలింగ్ బెల్ కొట్టినా, కూతురుకు ఫోన్ చేసినా స్పందించలేదు. దాంతో స్థానికుల సాయంతో తలుపు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా స్పందన రక్తపుమడుగులో విగతజీవిగా పడి ఉండడం కనిపించింది. పదునైన ఆయుధంతో విచక్షణారహితంగా పొడిచినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. కానీ, అక్కడ ఎలాంటి ఆయధం దొరకలేదని ఏసీపీ నరసింహారావు, సీఐ దుర్గారామలింగ ప్రసాద్ తెలిపారు. అపార్ట్‌మెంట్‌తో పాటు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు ఏసీపీ చెప్పారు. కాగా, స్పందనకు 2022లో అదే కాలనీకి చెందిన వినయ్‌కుమార్‌తో ప్రేమ వివాహం జరిగింది. కానీ, ఏడాది తర్వాత 2023లో భర్త తనను వేధిస్తున్నాడంటూ మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతనిపై కేసు నమోదైంది. ప్రస్తుతం వారి విడాకుల కేసు కోర్టులో ఉంది.
Admin
Studio18 News