Studio18 News - TELANGANA / : జయకేతనం సభలో జనసేనాని పవన్ కల్యాణ్ తెలంగాణ ప్రస్తావన తీసుకువచ్చారు. జనసేన జన్మస్థలం తెలంగాణ అయితే... ఆంధ్రప్రదేశ్ కర్మస్థలం అని పేర్కొన్నారు. తెలంగాణ కోటి రతనాల వీణ అని కొనియాడారు. ఆ రోజున కరెంట్ షాక్ తగిలి చనిపోబోయిన తనకు కొండగట్టు ఆంజనేయస్వామి దీవెన, తెలంగాణ అన్నదమ్ముల దీవెన, తనను ప్రేమించే ప్రజలందరి దీవెన ఉన్నాయని... తద్వారా తెలంగాణ భూమి తనకు పునర్జన్మనిచ్చిందని వివరించారు. అలాంటి తెలంగాణ నేల తల్లికి హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నానని వెల్లడించారు. బండినెక బండికట్టి అంటూ కాలికి గజ్జెకట్టిన వాడు, నేను కనిపిస్తే ఎలా ఉన్నావురా తమ్మీ అని ఆప్యాయంగా పలకరించే మన మధ్య లేని నా అన్న, మన గద్దరన్న నేల నుంచి వచ్చిన తెలంగాణ జనసైనికులకు, వీర మహిళలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మా ఆడపడుచులు, మా వీరమహిళల పోరాట స్ఫూర్తి మరువలేను. మీరు అందరి దృష్టిలో రాణి రుద్రమ్మలు. సూర్యభగవానుడి లేలేత కిరణాలు మా వీరమహిళలు... తేడా వస్తే కాల్చి ఖతమ్ చేసే లేజర్ బీమ్ లు మా జనసేన వీరమహిళలు. మీకు నేను రుణపడి ఉంటాను. జనసేన పుట్టింది తెలంగాణ గడ్డపైనే" అని పవన్ కల్యాణ్ వివరించారు.
Admin
Studio18 News