Studio18 News - TELANGANA / KHAMMAM : ఇటీవల కాలంలో సత్తుపల్లి అటవీశాఖ రేంజ్ పరిధిలో నాటు తుపాకులతో 5 జింకలను వేటాడి చంపిన ఘటన తెలిసిందే.. అయితే ఘటనలో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ చేసినట్లు జిల్లా అటవీ శాఖ అధికారి సిద్ధార్ద్ విక్రమ్ సింగ్ మీడియా సమావేశంలో తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా సత్తుపల్లి అటవీశాఖ రేంజ్ పరిధిలో గత నెల 24 న అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు సోదరుడి కుమారుడు మెచ్చా రఘు, అతని స్నేహితులు కొందరు అదే ప్రాంతంలో అటవీశాఖలో ఔట్ సోర్స్ ఉద్యోగిగా పనిచేస్తున్న గోపికృష్ణ అనే వ్యక్తి మద్దతు తీసుకొని ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిపారు. గత నెల 24 సాయంత్రం 6 గంటల తరువాత అటవీప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాలను మార్చి, ఏమార్చి గోపికృష్ణ అనే ఔట్ సోర్స్ ఉద్యోగి సహాయంతో నాటు తుపాకులతో ఓ వాహనంలో నలుగురు వ్యక్తులు వెళ్లి 5 జింకలను వేటాడి చంపినట్లు గుర్తించామని అన్నారు. ఘటన అనంతరం నిధితులు వివిధ ప్రాంతాలకు పారిపోయి తలదాచుకున్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పోలీసుల సహకారంతో నిన్న నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ చేసి, వేటకు ఉపయోగించిన నాటు తుపాకులను, ఒక 4 వీల్ వాహనంను సీజ్ చేసి నిందితులను జైలు కు పంపించామని తెలిపారు. ఈ కేసు చేదనలో పాల్గొని నిందితులను గుర్తించిన అటవీశాఖ సిబ్బందికి అభినందనలు తెలిపారు.
Admin
Studio18 News