Studio18 News - TELANGANA / HYDERABAD : హైదరాబాద్‌లో ఆశా వర్కర్ల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లుగా ఆశా వర్కర్లకు నెలకు రూ.18,000 వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద ఆశా వర్కర్లు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. ఈ ఆందోళనకు బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు సంఘీభావం తెలపడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆశా వర్కర్లకు కేవలం వేతన పెంపు కాకుండా, ఉద్యోగ భద్రత కూడా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన స్పష్టం చేశారు. ప్రతి నెలా ఒకటో తేదీన వేతనాలు చెల్లించేలా స్పష్టమైన విధానం తీసుకురావాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా, ప్రతి 1000 మంది జనాభాకు ఒక ఆశా కార్యకర్తను నియమించాలని, ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయాలని ఆయన సూచించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమవుతోందని ఆయన విమర్శించారు. ఇంకా, నిరసనకు ముందుగా అనుమతి ఇచ్చి, తర్వాత ఆశా వర్కర్లను అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని మండిపడ్డారు. ఇదిలా ఉండగా, ఆందోళన తీవ్రరూపం దాల్చడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆశా వర్కర్లను అనంతరం అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటనతో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ పరిసర ప్రాంతాల్లో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని, లేకపోతే ఉద్యమాలు మరింత ఉధృతమవుతాయని నాయకులు హెచ్చరించారు.
Admin
Studio18 News