Studio18 News - TELANGANA / HYDERABAD : నిలిచిన లారీల కారణంగా మణుగూరులో ప్రయాణం నరకప్రాయంగా మారింది. మణుగూరులో లారీల చక్రబంధంతో గంటల తరబడి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మణుగూరు సీఎస్‌పీ నుంచి విజయనగరం వరకు భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. గంటల తరబడి వాహనదారులు వేచి ఉండగా, పోలీసులు రంగంలోకి దిగారు. ట్రాఫిక్‌ను ఎస్సై నగేష్ కుమార్ క్లియర్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మార్చి 28: మణుగూరు ప్రధాన రహదారిపై శనివారం వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇసుక, బొగ్గు లారీలు ఇష్టానుసారంగా రోడ్డుపై నిలిపివేయడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. మణుగూరు సీఎస్‌పీ పాయింట్ నుంచి విజయనగరం వరకు రహదారి అంతా లారీలతో నిండిపోవడంతో ఇతర వాహనాలు కదలలేని పరిస్థితి ఏర్పడింది. బొగ్గు రవాణా లారీలు, ఇసుక వాహనాలు క్రమపద్ధతి లేకుండా నిలిపివేయడం వల్ల ఆర్టీసీ బస్సులు, ద్విచక్ర వాహనాలు, అత్యవసర వాహనాలు కూడా ట్రాఫిక్‌లో చిక్కుకుపోయాయి. ఈ సమస్యపై వాహనదారులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, లారీల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న మణుగూరు ఎస్సై నగేష్ కుమార్ వెంటనే స్పందించి, కానిస్టేబుళ్లతో కలిసి ఘటనాస్థలానికి చేరుకుని మండుటెండను లెక్కచేయకుండా రోడ్డుపై నిలిపిన లారీలను తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. సుమారు గంటన్నర పాటు శ్రమించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. రహదారిపై నిబంధనలకు విరుద్ధంగా లారీలను నిలిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు. సకాలంలో స్పందించి ట్రాఫిక్ క్లియర్ చేసిన ఎస్సై నగేష్ కుమార్ మరియు పోలీసు సిబ్బందిని ప్రజలు అభినందించారు.
Admin
Studio18 News