Studio18 News - TELANGANA / : Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఈ క్రమంలో రాష్ట్రమంతా తిరిగిచూద్దామా అని హరీశ్ రావుకు మంత్రి సవాల్ విసరగా.. మంత్రి సవాల్ ను హరీశ్ రావు స్వీకరించారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ పై చర్చలో భాగంగా హరీశ్ రావు మాట్లాడారు. ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టింది గట్టి బడ్జెట్టా.. ఒట్టి బడ్జెట్టా చెప్పాలంటూ ఎద్దేశా చేశారు. ఇది అవాస్తవిక బడ్జెట్, గాలి మేడల బడ్జెట్ అని తీవ్రంగా విమర్శించారు. బడ్జెట్ లో ఆర్అండ్ బి శాఖపై భట్టి మాట్లాడుతూ.. హామ్ (హైబ్రిడ్ యాన్యుటీ మోడల్) తెస్తున్నామని చెప్పారని హరీశ్ రావు అన్నారు. అంటే.. రాష్ట్ర ప్రభుత్వం 40శాతం ఇస్తుంది, కాంట్రాక్టర్లు 60శాతం పెట్టుకోవాలి. అయితే, కాంట్రాక్టర్లు పెట్టిన డబ్బు ఎలా చెల్లిస్తారని హరీశ్ రావు ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వంపై వచ్చే పదేళ్లపాటు అప్పుల భారాన్ని మోపుతారా..? చెప్పాలన్నారు. దీంతో మంత్రి కోమటిరెడ్డి కలుగజేసుకొని వివరణ ఇచ్చారు. 40శాతం కాంట్రాక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించి.. 60శాతం ప్రభుత్వ షూరిటీతో బ్యాంకర్ల ద్వారా లోను తీసుకొని రోడ్ల నిర్మాణాలు పూర్తిచేయాలని అన్నారు. హరీశ్ రావు మాట్లాడుతూ.. కాంట్రాక్టర్లు పెట్టిన డబ్బులు ఏ విధంగా చెల్లిస్తారో చెప్పాలని అన్నారు. ఎందుకంటే.. నేషనల్ హైవేలలో అయితే టోల్ గేట్స్ పెట్టి వసూళ్లు చేసి కాంట్రాక్టర్లకు చెల్లిస్తారు. మరి మీరు.. గ్రామం నుంచి మండలానికి పోవాలంటే టోల్ గేట్లు పెట్టి ప్రజల దగ్గర డబ్బులు వసూళ్లు చేస్తారా..? వచ్చే పదేళ్లపాటు ప్రభుత్వాలపై అప్పుల భారం వేస్తారా..? చెప్పాలని హరీశ్ రావు ప్రశ్నించారు. మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. గ్రామీణ రోడ్లు, రాష్ట్ర రహదారులకు టోల్ విధించే ఆలోచన లేదని చెప్పారు. కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన 40శాతం కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని అన్నారు. వారికి ఆరు నెలలు లేదా మూడు నెలలకు చెల్లిస్తామని మంత్రి చెప్పారు. ప్రతి గ్రామం నుంచి మండలానికి డబుల్ రోడ్లు వేయిస్తామని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో సిరిసిల్ల, సిద్ధిపేట, గజ్వేల్ కే రోడ్లు వేశారని, ఆ మూడు చోట్ల రోడ్లకు చివరికి సింగరేణి నిధులు కూడా వాడారంటూ కోమటిరెడ్డి విమర్శించారు. ఛాలెంజ్ చేస్తున్నా.. రాష్ట్రమంతా తిరిగి చూద్దామా అని హరీశ్ రావుకు మంత్రి కోమటిరెడ్డి సవాల్ చేశారు. మంత్రి కోమటిరెడ్డి సవాల్ ను హరీశ్ రావు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో ఆర్ అండ్ బీ పనుల గురించి లెక్కలు తీద్దామన్నారు. రోడ్ల గురించి ఒకరోజు ప్రత్యేకంగా చర్చిద్దామని చెప్పారు.
Admin
Studio18 News