Studio18 News - తెలంగాణ / : తెలంగాణలో టీచర్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన డీఎస్‌సీ పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ విడుదల చేశారు. 55 రోజుల్లోనే ఫలితాలను విడుదల చేసినట్లు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వెల్లడించారు. 1:3 నిష్పత్తిలో అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందని తెలిపారు. అలాగే అక్టోబర్ 9వ తేదీన ఎల్‌బీ స్టేడియంలో నియామకపత్రాలు అందజేస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం పదేళ్లలో ఒకే ఒక్క డీఎస్‌సీ ఇచ్చిందని దుయ్యబట్టారు. అటు టీజీపీఎస్‌సీని ప్రక్షాళన చేశామన్న ముఖ్యమంత్రి.. త్వరలోనే గ్రూప్-1 పరీక్షలు నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తామని తెలిపారు. అలాగే పాఠశాల ఫీజుల నియంత్రణపై త్వరలో కమిటీ వేస్తామన్నారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా 11,062 పోస్టుల భర్తీకి మార్చి 1న డీఎస్‌సీ నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. జులై 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు పరీక్షలు జరిగాయి. మొత్తం 2.45లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు.
Admin
Studio18 News