Studio18 News - తెలంగాణ / : ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసినా రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య సమసిపోదని, కాబట్టి నిరుద్యోగ యువత డిమాండ్ - సప్లయ్ సూత్రాన్ని గుర్తుంచుకోవాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. మాసాబ్‌ట్యాంక్‌లో బీఎఫ్ఎస్ఐను (బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సురెన్స్) స్కిల్ ప్రోగ్రాం మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... లక్షల ఉద్యోగాలు భర్తీ చేసినా నిరుద్యోగ సమస్య తీరిపోదన్నారు. దీని తీవ్రతను తమ ప్రభుత్వం గుర్తించిందన్నారు. ప్రతి సంవత్సరం 3 లక్షల మంది పట్టాలు తీసుకొని బయటకు వస్తున్నారన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై పరిశ్రమల యాజమాన్యాలతో మాట్లాడినట్లు తెలిపారు. ఎలాంటి కోర్సులు చదివిన వారు కావాలని అడుగుతున్నట్లు చెప్పారు. అయినప్పటికీ నిరుద్యోగ యువత డిమాండ్ - సప్లయ్ సూత్రాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. డిగ్రీ చదివే వారు భవిష్యత్తు దిశగా ఆలోచన చేయాలన్నారు. కొందరు విద్యార్థులు కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవడం లేదన్నారు. బ్యాంకులు, బీమా రంగాల్లో చాలా ఉద్యోగాలు ఉన్నాయని తెలిపారు. నాయకుడిగా రాణించాలన్నా నైపుణ్యం ముఖ్యమని తెలిపారు. ఉద్యోగం, ఉపాధి లేకుంటే యువత చెడు వ్యసనాల వైపు వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. బీటెక్ చదివిన వారు కూడా డ్రగ్స్ విషవలయంలో చిక్కుకుంటున్నారని ఆవేదన చెందారు. మన విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడాలన్నారు. ఇంజినీరింగ్ విద్యార్థులు జాబ్ స్కిల్స్ నేర్చుకోవడం లేదని, కొన్ని కాలేజీల్లో అధ్యాపకులు, వసతులు ఉండటం లేదన్నారు. కాలేజీలను ఇలాగే రన్ చేస్తే వాటి గుర్తింపు రద్దు చేయడానికి కూడా వెనుకాడేది లేదని హెచ్చరించారు. త్వరలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. తెలంగాణ ఏర్పడిన పదేళ్ల తర్వాత కూడా 60 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని, తాము అధికారంలోకి వచ్చిన మూడు నెలల కాలంలో 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని వెల్లడించారు. డీఎస్సీ, గ్రూప్స్ విభాగాల్లో మరో 35 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. చదువుతో పాటు నాలెడ్జ్, కమ్యూనికేషన్ ఉండాలన్నారు.
Admin
Studio18 News