Studio18 News - TELANGANA / NAGARKURNOOL : నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలంలోని బాలుర సాంఘీక గురుకుల సంక్షేమ వసతి గృహాన్ని గురువారం రాత్రి నాగర్ కర్నూల్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దేవ సహాయం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వండిన భోజనాన్ని ఆయన పరిశీలించారు. టీచర్స్ మెస్ కమిటీతో భోజనం ఎలా ఉందో ఆరా తీశారు. బియాన్ని పరిశీలించి, బియ్యం స్టాక్ రిజిస్టర్‌ను చెక్ చేశారు. వండే బియ్యాన్ని ఒకరోజు ముందే శుభ్రం చేసుకొని సిద్ధంగా ఉంచుకోవాలని వంట ఏజెన్సీకి సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేస్తూ ముచ్చటించారు. భవిష్యత్‌లో ఏం కావాలనుకుంటున్నారని, మీ ఆశయం ఏమిటని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పదవ తరగతి విద్యార్థుల స్టడీ అవర్స్‌ను పరిశీలించారు. గురుకుల పాఠశాలలో ఏ వైనా సమస్యలుంటే నివేదిక ఇవ్వాలని పాఠశాల ప్రిన్సిపాల్ ను ఆదేశించారు. పాఠశాలలో చదువులు, వసతులు, సమస్యలు తదితర అంశాలను నిశితంగా ఆయన పరిశీలించారు. గురుకుల పాఠశాలలో పరిశుభ్రతపై అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. గురుకుల పాఠశాలలో విద్యార్థుల ఆరోగ్యం పరిశుభ్రత అత్యంత కీలకమని సూచించారు. ప్రభుత్వం ప్రకటించిన మెనూ ప్రకారమే విద్యార్థులకు భోజనాన్ని అందించాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి పాఠశాలలోనే రాత్రి బస చేసిన ఆయన విద్యార్థులకు ఏలాంటి సమస్యలు లేకుండా చూడాలంటూ నిర్వాహకులకు ఆదేశించారు.
Also Read : అర్బన్ పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే
Admin
Studio18 News