Studio18 News - తెలంగాణ / : కార్యకర్తల అత్యుత్సాహం కారణంగానే వరంగల్ జిల్లాలో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి వర్గీయుల మధ్య వివాదం చెలరేగిందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. పరకాలలో నెలకొన్న వివాదంపై ఆయన స్పందించారు. ఈ వివాదం విషయంలో మంత్రి, ఎమ్మెల్యే ఇరువురితో మాట్లాడినట్లు తెలిపారు. ఈ వివాదంపై ఇరు వర్గాలతో మాట్లాడాలని ఇన్ చార్జి మంత్రికి సూచించినట్లు ఆయన చెప్పారు. మంత్రి సురేఖ, ఎమ్మెల్యే రేవూరి మధ్య వివాదం పార్టీ అంతర్గత సమస్య అని, ఇది త్వరలో సమసిపోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ఎమ్మెల్యే పోచారం, మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి మధ్య కూడా సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు. వీరితో చర్చించే బాధ్యతను డీసీసీ అధ్యక్షుడికి అప్పగించామని తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తలకు నష్టం జరగకుండా సమస్యను సామరస్యంగా పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. పరకాలలో వివాదం ఏమిటంటే.. వరంగల్ జిల్లాలో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి వర్గీయుల మధ్య ఫ్లెక్సీల వివాదం చెలరేగింది. దసరా బతుకమ్మ వేడుకల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ఎమ్మెల్యే రేవూరి ఫోటో లేకపోవడం వివాదానికి కారణమైంది. ఫ్లెక్సీల్లో ఎమ్మెల్యే పేరు పెట్టాలని ఆయన వర్గీయులు మంత్రి వర్గీయులకు సూచించారు. అయితే ఫ్లెక్సీల్లో ఎమ్మెల్యే ఫోటోలు లేకపోవడంతో ఆయన వర్గీయులు కొండా వర్గీయులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించేశారు. దీంతో ఎమ్మెల్యే వర్గీయులపై మంత్రి వర్గీయులు దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే వర్గీయులు గాయపడ్డారు. గాయపడిన ఎమ్మెల్యే వర్గీయులు ఫిర్యాదు చేయడంతో మంత్రి కొండా అనుచరులను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో అధారాలు లేకుండా తమ కార్యకర్తలను అరెస్టు చేశారంటూ మంత్రి కొండా అనుచరులు పేర్కొంటూ గీసుకొండ పోలీసు స్టేషన్ పరిధిలో నర్సంపేట రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ధర్నా కారణంగా రహదారిపై వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు నేతలతో చర్చించి ఆందోళన విరమింపజేశారు. విషయం తెలుసుకున్న మంత్రి కొండా సురేఖ కూడా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ పరిణామాలతో మంత్రి, ఎమ్మెల్యే వర్గీయుల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి.
Admin
Studio18 News