Studio18 News - TELANGANA / HYDERABAD : అమృత-ప్రణయ్ ల ప్రేమ, పెళ్లి; ప్రణయ్ ని మామ మారుతిరావు హత్య చేయించడం... అచ్చం ఓ సినిమా స్టోరీని తలపించే నిజ జీవిత గాథ ఇది. 2018 సెప్టెంబరు 14న మిర్యాలగూడలో ప్రణయ్ హత్య జరిగింది. కాగా, ప్రణయ్ హత్య జరిగే నాటికి అమృత ఐదు నెలల గర్భవతి. ఆమెను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకెళ్లి వస్తున్న సమయంలోనే ప్రణయ్ హత్య జరిగింది. ప్రస్తుతం అమృత-ప్రణయ్ ల కుమారుడికి ఆరేళ్ల వయసు. అమృత, తన కుమారుడితో కలిసి హైదరాబాదులో ఉంటోంది. భర్త హత్యకు గురయ్యాక కొంతకాలం పాటు తీవ్ర మనోవేదనకు గురైన ఆమె... కాల క్రమంలో కోలుకుంది. సోషల్ మీడియాలో ఇన్ ఫ్లుయెన్సర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్ చానల్, ఇతర సోషల్ మీడియా వేదికలపై ఆమెకు పెద్ద సంఖ్యలో ఫాలోవర్లు, సబ్ స్క్రైబర్లు ఉన్నారు. తన కుమారుడి గురించిన వీడియోలను పంచుకుంటూ సామాజిక మాధ్యమాల్లో ఎంతో యాక్టివ్ గా ఉంటోంది. నిన్న ప్రణయ్ హత్య కేసు నిందితులకు కోర్టు శిక్షలు విధించిన నేపథ్యంలో... అమృత-ప్రణయ్ దంపతుల కుమారుడి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Admin
Studio18 News