Studio18 News - తెలంగాణ / : ప్రస్తుతం మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టు వల్ల సుమారు 2 లక్షల మందిని రోడ్డున పడేసే ప్రయత్నం జరుగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. అంబర్‌పేటలో మూసీ పరీవాహక ప్రాంతాల్లో పార్టీ నేతలతో కలిసి ఆయన తాజాగా పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు బాధితులను కలిసి వారితో మాట్లాడారు. గతంలో పేదలకు ఇబ్బందులు రాకూడదనే తాము మూసీకి సంబంధించిన ప్రాజెక్టులను నిలిపివేశామని తెలిపారు. నగరంలో బీఆర్ఎస్‌కు ఓటు వేసిన వారిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పగబట్టారని చెప్పిన ఆయన... లక్షలాది మందికి నిద్రలేకుండా చేస్తున్నారని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి కూడబలుక్కున్నారా అని కేటీఆర్ ప్రశ్నించారు. పేదల ఇళ్లను కూల్చుతుంటే ఈ ప్రాంత ఎంపీ ఎక్కడికి వెళ్లారని పరోక్షంగా కిషన్‌రెడ్డికి చురకలంటించారు. బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇళ్ల వద్దకు బుల్డోజర్లు వస్తే కంచెలు పెట్టాలని సూచించారు.
Admin
Studio18 News