Studio18 News - తెలంగాణ / : ఒవైసీ కాలేజీని హైడ్రా వంద శాతం కూల్చివేస్తుందని కాంగ్రెస్ నేత మహమ్మద్ ఫిరోజ్‌ఖాన్ తేల్చి చెప్పారు. ఎంఐఎం అక్రమాలను బయటపెట్టినందుకే ఆ పార్టీ నేతలు తనపై దాడిచేస్తున్నారని, ఈ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి స్పందించి దీనికి ఫుల్‌స్టాప్ పెట్టాలని కోరారు. ఎంఐఎం తనపై దాడిచేసినా కాంగ్రెస్ ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే ముఖ్యమంత్రిని కలిసి అన్ని విషయాలు వివరిస్తానని చెప్పారు. తమతో సన్నిహితంగా లేకుంటే మత ఘర్షణలు రేకెత్తుతాయనేలా ఎంఐఎం ప్రవర్తిస్తోందని ఆరోపించారు. బీఆర్ఎస్ నేత కేటీఆర్‌పై కొండా సురేఖ నిజమే మాట్లాడారని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ఆసిఫ్‌నగర్‌లో నిన్న కాంగ్రెస్, ఎంఐఎం నేతల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు కారణమైంది. నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్, కాంగ్రెస్ నేత ఫిరోజ్‌ఖాన్ అనుచరుల మధ్య గొడవ జరిగింది. బ్యాంకు కాలనీలో జరుగుతున్న రహదారి పనులను పరిశీలించేందుకు ఫిరోజ్‌ఖాన్ వెళ్లడంతో ఇరు వర్గాల మధ్య గొడవ చోటుచేసుకుంది. ఈ ఘటనలో కాంగ్రెస్, ఎంఐఎం కార్యకర్తలకు దెబ్బలు తగలడం మరింత ఉద్రిక్తతకు కారణమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు.
Admin
Studio18 News