Studio18 News - తెలంగాణ / : కూకట్‌పల్లిలో పేదల పేర్లతో కొంతమంది కాలేజీలు, పెట్రోల్ బంకులను నిర్వహిస్తున్నారని, వాటిపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ దృష్టి సారించాలని కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు విజ్ఞప్తి చేశారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో మల్లన్న సాగర్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... బీజేపీతో కుమ్మక్కు అవుదామని బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోందని, కానీ కారు పార్టీని కమలం పార్టీ నమ్మదన్నారు. హైడ్రా మీద బీఆర్ఎస్ విషప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రా మీద విషం కక్కడం ద్వారా తెలంగాణను అల్లకల్లోలం చేయాలని కేటీఆర్, హరీశ్ రావులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తాను దత్తత తీసుకున్న గ్రామంలోని ఇళ్లను హరీశ్ రావు బుల్డోజర్లతో కూల్చివేయించారని ఆరోపించారు. ఇప్పుడు మాత్రం చెరువులను ఆక్రమించిన నిర్మాణాల్ని కూలగొడతామంటే బుల్డోజర్‌కు అడ్డుపడతానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. హైడ్రా బాధితులకు పరిహారం డిమాండ్ చేస్తున్న హరీశ్ రావుకు మల్లన్న సాగర్ నిర్వాసితులు పట్టరా? అని నిలదీశారు. హైడ్రాపై సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో కుంటలు, నాలాలు కబ్జా చేశారని ధ్వజమెత్తారు. మొన్నటి అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఖర్చు చేసినట్లుగా కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఖర్చు చేయలేదన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రైతులను కూడా పోలీసులతో కొట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Admin
Studio18 News