Studio18 News - తెలంగాణ / : ఈ చలికాలంలో హైదరాబాద్ సహా తెలంగాణ ప్రజలు అధిక చలిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అక్టోబరు, నవంబరు మధ్య కాలంలో లా నినా కారణంగా ఈ చలికాలంలో తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు బాగా పడిపోతాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. భూమధ్యరేఖకు సమీపంలో సముద్ర ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తగ్గితే దాన్ని లా నినా అంటారు. సాధారణం కంటే కనీసం 0.5 డిగ్రీలు పడిపోతే లా నినా ఎఫెక్ట్ అంటారు. పసిఫిక్ మహాసముద్రం పెరూ తీరంలో ఈ ఉష్ణోగ్రతల్లో మార్పులు జరుగుతాయి. లా నినా తరచుగా తెలంగాణతో పాటు మన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో చల్లని వాతావరణానికి దారి తీస్తుంది. ఐఎండీ చెప్పిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది చలికాలంలో ప్రజలు వణికిపోవాల్సిందే. ఉదయాన్నే పొగమంచు ఎక్కువగా ఉంటుందని ఐఎండీ తెలిపింది. మామూలుగా హైదరాబాద్‌లో ప్రతి శీతాకాలం చలి సాధారణం కంటే అధికంగా ఉండదు. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ ప్రకారం.. లా నినా ప్రభావంతో తెలంగాణలో గతంలోనూ ఇటువంటి వాతావరణ పరిస్థితి నెలకొంది. చివరిసారిగా 2022లో లా నినా ప్రభావంతో అతి చల్లని వాతావరణాన్ని తెలంగాణ ప్రజలు ఎదుర్కొన్నారు. ఆ సంవత్సరంలో రాజేంద్రనగర్, పటాన్ చెరు వంటి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు దాదాపు 8 డిగ్రీల వరకు పడిపోయాయి. ఇక ఆదిలాబాద్‌లో 4 డిగ్రీలకు కూడా పడిపోయింది. లి నినా ప్రభావంతో గతంలో హైదరాబాద్‌లోనూ సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రస్తుతం లి నినా పరిస్థితుల వల్ల త్వరలోనే సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, వాటిని ఎదుర్కొనేందుకు ప్రజలు సంసిద్ధంగా ఉండాలని ఐఎండీ సూచించింది.
Admin
Studio18 News