Studio18 News - TELANGANA / HYDERABAD : పార్టీ అధిష్ఠానం తనకు గతంలో అవకాశం ఇచ్చినా వద్దని చెప్పి, ముందు పని చేస్తానని చెప్పానని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత విజయశాంతి వెల్లడించారు. తాను గతంలోనూ కాంగ్రెస్ పార్టీలో పని చేశానని, కానీ ఏనాడూ ఇది కావాలని అడగలేదని అన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఆమె మాట్లాడుతూ, గతంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానం మేరకు తాను తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరానని తెలిపారు. పార్టీ అధిష్ఠానం ఎప్పుడు ఏం నిర్ణయం తీసుకుంటుందో ఎవరికీ తెలియదని వ్యాఖ్యానించారు. ఎవరికి, ఎప్పుడు ఏ బాధ్యత ఇవ్వాలో అప్పుడే ఇచ్చి పని చేయించుకుంటుందని ఆమె అన్నారు. పార్టీలో ఉండి పదవులు రాని వారు కాస్త ఓపిక పట్టాలని సూచించారు. పార్టీ తనకు అవకాశం ఇచ్చినప్పుడే మాట్లాడాలని అనుకున్నానని, అప్పటి వరకు పని చేసుకుంటూ వెళ్లానని విజయశాంతి అన్నారు. అవకాశం కోసం ఎదురు చూశానని, ఇప్పుడు తనకు అవకాశం వచ్చిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఒక పద్ధతి ఉంటుందని, దాని ప్రకారమే అందరూ పని చేయాలని ఆమె అన్నారు. ప్రజల సమస్యకు పరిష్కారం చూపించే దిశగా తాము పోరాడతామని అన్నారు. ఒక ఆలోచన, ముందుచూపుతో రాష్ట్ర ప్రజల కోసం పలు సంక్షేమ పథకాలను కాంగ్రెస్ పార్టీ ప్రకటించి, అమలు చేస్తోందని అన్నారు.
Admin
Studio18 News