Studio18 News - TELANGANA / : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై ఎన్ని కేసులు పెట్టినా... చివరకు తనను కాల్చి చంపినా కూడా పేదల పక్షానే మాట్లాడుతానని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. సీఎం తన సైకో రౌడీ కుట్రలను బంద్ చేసి పరిపాలనపై దృష్టి సారించాలన్నారు. బీఆర్ఎస్ గురుకుల బాట కార్యక్రమం నేపథ్యంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఆయన తీవ్రంగా స్పందించారు. గురుకులాల్లో టాయిలెట్లు బాగా లేవని, కుళ్లిన కూరగాయలతో పిల్లలకు భోజనం పెడుతున్నారని, యూనిఫామ్స్ లేకుండా, బెడ్లు, బూట్లు లేకుండా విద్యార్థులు ఎలా చదువుకోగలరని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలకు దమ్ముంటే తమ బంగ్లాల నుంచి బయటకు వచ్చి గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి చూడాలన్నారు. ప్రతిభావంతులైన విద్యార్థులను పరీక్షల ద్వారా ఎంపిక చేసి... వారికి సరైన ఉపాధ్యాయులను ఇవ్వకుంటే ఎలా? అన్నారు. ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళలో కూడా పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడలేని పరిస్థితి ఉందని విమర్శించారు. తనను ఏం చేసినా తాను మాత్రం నోరు లేని పేద బిడ్డల పక్షాన నిలబడతానన్నారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం మతిస్థిమితం లేని మంత్రులు, ఎమ్మెల్యేలు, మరెందరో చిల్లరమూకలు తనపై దాడి చేస్తున్నారని, కానీ తాను బెదిరే వ్యక్తిని కాదన్నారు. పోలీసులతో అడ్డుకున్నంత మాత్రాన తమ గురుకుల బాట కార్యక్రమం ఆగదన్నారు. గురుకులాల్లోని వాస్తవాలను ఎందుకు దాచి పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : మళ్లీ 80 వేల పాయింట్లు దాటిన సెన్సెక్స్
Admin
Studio18 News