Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ యువ జంట కాళ్ల పారాణి ఆరకముందే జీవితాన్ని ముగించేసింది. పెళ్లైన గంటల వ్యవధిలోనే ఘర్షణ పడి ఇద్దరూ కత్తిపోట్లకు గురై కన్నుమూశారు. కర్ణాటక రాష్ట్రం కోలార్ గోల్డ్ ఫీల్డ్‌లోని చంబరసనహళ్లి గ్రామంలో బుధవారం ఈ విషాదం చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలోని సంతూరుకు చెందిన నవీన్ (26), కర్ణాటకలోని కోలూరు జిల్లా కేజీఎఫ్ తాలూకా బైనేహళ్లికి చెందిన లిఖిత (22) కొంత కాలం ప్రేమించుకున్నారు. వీరి ప్రేమను పెద్దలు అంగీకరించడంతో ఇరు కుటుంబాల బంధు మిత్రుల సమక్షంలో ఈ నెల 7వ తేదీ (బుధవారం)న కేజీఎఫ్ పట్టణంలోని కల్యాణ మండపంలో ఇద్దరూ ఒక్కటయ్యారు. అనంతరం తమ బంధువులతో నూతన దంపతులు కొద్దిసేపు సరదాగా గడిపారు. ఆ సాయంత్రం లిఖితతో పాటు ఆమె తల్లిదండ్రులను అదే గ్రామంలో ఉన్న తన బంధువులను నవీన్ తన ఇంటికి తీసుకువెళ్లాడు. అక్కడ ఓ గదిలో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో నూతన దంపతులు ఘర్షణ పడ్డారు. ఆ వివాదం తీవ్ర స్థాయికి చేరడంతో లిఖితపై నవీన్ కత్తితో దాడి చేశాడు. గదిలో నుంచి పెద్దగా అరుపులు వినపడడంతో కుటుంబ సభ్యులు తలుపులు బద్దలు కొట్టి లోపలకు వెళ్లి చూసి నిర్ఘాంతపోయారు. లిఖిత అప్పటికే రక్తపు మడుగులో పడి మృతి చెందగా నవీన్ కూడా తీవ్ర గాయాలపాలై పడి ఉన్నాడు. వెంటనే కుటుంబ సభ్యులు నవీన్‌ను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం అతడు మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమించి ఇష్టపూర్వకంగా వివాహం చేసుకున్న నవ దంపతులు కాళ్ల పారాణి ఆరకముందే ఘర్షణ పడి మృతి చెందడాన్ని ఇరు కుటుంబాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. వధువు లిఖితపై కత్తితో దాడి చేసిన వరుడు నవీన్.. ఆ తర్వాత ఆత్మహత్యాయత్నం చేసుకుని ఉంటాడని భావిస్తున్నారు. అయితే వీరి మధ్య ఘర్షణకు కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు అంటున్నారు.
Admin
Studio18 News