Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : వైసీపీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్ రావులు పార్టీకి, పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వీరి రాజీనామాలపై ఆ పార్టీ నేతలు తీవ్రంగా స్పందిస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కూడా మీడియా సమావేశం పెట్టి టీడీపీపై విమర్శలు చేశారు. ప్రస్తుతం ఏపీలో కూటమికి 164 మంది ఎమ్మెల్యేలు, 21 మంది ఎంపీలు ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఈ పరిస్థితుల్లో వైసీపీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేల అవసరం ఏమి వచ్చిందని ప్రశ్నించారు. చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో ఎమ్మెల్యేలు, ఎంపీలను కొనుగోలు చేయడం రివాజేనని అన్నారు. 2014 – 19 మధ్య టీడీపీ హయాంలోనూ వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను చేర్చుకున్న విషయాన్ని కాకాణి గుర్తు చేశారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికల్లో గెలిచిన వైసీపీ నాయకుల చేత చంద్రబాబు రాజీనామా చేయించి వారిని కొనుగోలు చేస్తున్నారంటూ విమర్శించారు. రాజీనామాలతో ఖాళీ అయ్యే స్థానాల్లో టీడీపీ నాయకులను పోటీలో నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, అందుకే ప్రజల దృష్టిని మరల్చేందుకు వైసీపీ నేతలను టీడీపీలో చేర్చుకుంటోందని ఆయన విమర్శించారు.
Admin
Studio18 News