Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గత కొన్ని రోజులుగా వివిధ శాఖలపై సమీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. బుధవారం తన కుమారుడు, మంత్రి నారా లోకేశ్ నిర్వహిస్తున్న ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖలు, ఆర్టీజీఎస్ లపై సచివాలయంలో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలో పౌర సేవలు అన్నీ ఒకే యాప్ లో అందించేలా చర్యలు చేపట్టాలని చెప్పారు. టాటా సంస్థ ఇప్పటికే ప్రత్యేక యాప్ రూపొందించి కొంత వరకూ మెరుగైన రీతిలో సేవలు అందిస్తోందని అన్నారు. ఐటీ కంపెనీలు ద్వితీయ శ్రేణి నగరాలకు ప్రస్తుతం విస్తరించేందుకు ఆసక్తి కనబరుస్తున్న కారణంగా వాటిని రాష్ట్రానికి తెచ్చేలా ప్రయత్నించాలని చెప్పిన సీఎం రాష్ట్రాన్ని స్టార్టప్ హబ్ గా తీర్చిదిద్దేందుకు వీలుగా సమగ్ర నివేదిక రూపొందించాలని సూచించారు. విశాఖ ఐఐఎం, తిరుపతి ఐఐటీ సహకారంతో దేశ వ్యాప్తంగా ఉత్తమ విధానాలను అనుసరిస్తున్న స్టార్టప్ లను గుర్తించి వాటిని రాష్ట్రానికి తీసుకువచ్చేలా ప్రయత్నాలు చేయాలని చెప్పారు. రాష్ట్రంలో సైబర్ సెక్యూరిటీకి సంబంధించి ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసే ఆలోచనలో ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం ఉందని, రిలయన్స్ సంస్థ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ .. రాష్ట్రంలో ఐటీ అభివృద్ధికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు సీఎం కు వివరించారు.
Admin
Studio18 News