Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : విజయవాడ దుర్గా అమ్మవారి ఆలయంలో కూటమి నేతలు పార్కింగ్, టోల్ ఫీజులు వసూలు చేస్తూ రూ. 4 కోట్ల అవినీతికి పాల్పడ్డారని వైసీపీ నేత పోతిన మహేశ్ ఆరోపించారు. కనకదుర్గ రోడ్డులో షాపుల అద్దె పేరుతో మరింత కొట్టేయడానికి రెడీ అయ్యారని చెప్పారు. దీనికంతటికీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కారణమని అన్నారు. కాంట్రాక్టు పూర్తయిన తర్వాత మళ్లీ 10 శాతం పెంచి సదరు కాంట్రాక్టర్ కు కాంట్రాక్టు ఇవ్వాలని... కానీ, అలా చేయకుండా ఫ్రీగా టోల్ వసూలు చేసుకునేలా జీవో ఇచ్చారని అన్నారు. ఫ్రీగా వసూలు చేసుకున్న రూ. 2 కోట్లకు పైగా సొమ్మును కాంట్రాక్టర్ నుంచి ఎందుకు వసూలు చేయలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం మారగానే అమ్మవారి సాక్షిగా దోపిడీని ప్రారంభించారని మండిపడ్డారు. కూటమి అధికారంలోకి వస్తే దోచుకో, దాచుకో, తినుకో అనే పరిస్థితి వస్తుందని జగన్ చెప్పారని అన్నారు. కనకదుర్గ నగర్ షాపుల ఏర్పాటులో కూడా బుద్దా వెంకన్న అవినీతికి పాల్పడ్డారని చెప్పారు. వ్యాపారాలు సజావుగా సాగుతున్నా 49 శాతం అద్దెలు తగ్గించారని విమర్శించారు. ఒక్కో షాపుకు బుద్దా వెంకన్న రూ. 5 లక్షల చొప్పున లంచం తీసుకున్నారని చెప్పారు. మూడు నెలల్లో రూ. 4 కోట్లు వసూలు చేశారని అన్నారు. అమ్మవారి సొమ్మును కొట్టేయడంలో బుద్దా వెంకన్నకు ఏఈ లక్ష్మణ్ సహకరిస్తున్నారని ఆరోపించారు. వీటన్నిటిపై ఏసీబీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
Admin
Studio18 News