Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : Visakha MLC Election : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలతో విశాఖ ఉమ్మడి జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ఎమ్మెల్సీ ఎన్నికకు ఇప్పటికే ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చింది. వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణను పేరును వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే ఖరారు చేశారు. అయితే, బొత్స సత్యనారాయణపై టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నుంచి పోటీచేసే అభ్యర్థి ఎవరనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. కూటమి నుంచి రేసులో పీలా గోవింద్, గండి బాబ్జీ, పీవీజీ కుమార్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అనకాపల్లి జిల్లా నేతలతో ఆ నియోజకవర్గం ఎంపీ సీఎం రమేశ్ భేటీ అయ్యారు. నేడు మరోసారి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో ఉమ్మడి విశాఖ జిల్లా నేతలు భేటీ కానున్నారు. అందరి అభిప్రాయాలు తీసుకొని పోటీపై ఆసక్తి ఉన్న అభ్యర్థుల లిస్ట్ ను పల్లా శ్రీనివాసరావు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడుకు పంపించనున్నారు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకి 615 ఓట్లు ఉన్నాయి. మొత్తం 841 ఓట్లకు గాను వైసీపీకి 75 శాతం బలం ఉండగా, అధికార కూటమికి కేవలం 215 ఓట్లు మాత్రమే ఉన్నాయి. అయితే ఎన్నికల ముందు… ఆ తర్వాత కొందరు వైసీపీ కార్పొరేటర్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరంతా స్థానిక సంస్థల శాసనమండలి ఓటర్లే. ఐతే ఇలా పార్టీ మారిన ఓటర్ల సంఖ్యపై స్పష్టత లేకపోవడంతో ఎన్నిక రసవత్తరంగా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో తమ ఓటర్లను నిలబెట్టుకోవడం వైసీపీకి సవాల్‌గా మారింది. బొత్స సత్యనారాయణ బరిలో ఉండటంతో వైసీపీ అధిష్టానం గెలుపుపై ధీమాతో ఉంది. కూటమి పార్టీల నేతలుసైతం విశాఖ ఉమ్మడి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉన్నారు. ఈ క్రమంలో పలువురు వైసీపీ కార్పొరేటర్లు, ఎంపీటీసీ, జడ్పీటీసీలను కూటమి వైపుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ బరిలో నిలవనుండటంతో వైసీపీ ప్రజాప్రతినిధులు కూటమి పార్టీల్లోకి వలసలు వెళ్లకుండా ఆపగలుగుతారని వైసీపీ అధిష్టానం భావిస్తుంది. ఈ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ వ్యూహాలను అధికారంలోని కూటమి ప్రభుత్వం ఏ మేరకు తిప్పికొడుతుందనే విషయం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని రేపుతోంది.
Admin
Studio18 News