Studio18 News - ANDHRA PRADESH / : ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని చవిచూసిన సంగతి తెలిసిందే. కేవలం 11 సీట్లకే ఆ పార్టీ పరిమితమైంది. దాంతో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ప్రక్షాళనపై దృష్టి సారించారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న వారిపై చర్యలకు ఉపక్రమించారు. ఇందులో భాగంగా మాజీ మంత్రి, నగరి మాజీ ఎమ్మెల్యే రోజా ఫిర్యాదుతో నగరి వైసీపీ నేతలపై సస్పెన్షన్ వేటు వేశారు. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో రాష్ట్ర వైసీపీ ట్రేడ్ యూనియన్ కార్యదర్శి కేజే కుమార్, నగరి మున్సిపల్ మాజీ చైర్మన్ కేజే శాంతి, వీరి కుటుంబ సభ్యులు పార్టీకి, తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని నగరి మాజీ ఎమ్మెల్యే రోజా ఇటీవల అధినేతకు ఫిర్యాదు చేశారు. వారిపై అభియోగాలు నిజమని తేలడంతో క్రమశిక్షణ చర్యల్లో భాగంగా వారిని పార్టీ నుంచి తొలగిస్తున్నామని వైసీపీ అధిష్ఠానం వెల్లడించింది. పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రద్దు చేస్తున్నామని తెలిపింది. ఇకపై వారి కార్యక్రమాలకు, వైసీపీకి ఎలాంటి సంబంధం లేదని చిత్తూరు జిల్లా ప్రెసిడెంట్ కేఆర్‌జే భరత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు నగరి నేతలను సస్పెండ్ చేస్తూ ఒక లేఖను విడుదల చేశారు.
Admin
Studio18 News