Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : మాజీ మంత్రి, వైసీపీ పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలపై జుడీషియల్ విచారణ జరిపించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో రికార్డులు దగ్ధం కావడం వెనక పెద్దిరెడ్డి హస్తం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో నిన్న తిరుపతిలో నారాయణ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా పెద్దిరెడ్డి భూదందాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఆయన వల్ల భూములు కోల్పోయిన బాధితులు బయటకు వచ్చి ఫిర్యాదులు చేయాలని పిలుపునిచ్చారు. కేరళలోని వయనాడ్ విషాద ఘటనపై నారాయణ మాట్లాడుతూ.. అది బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. పకృతి విలయతాండవానికి ఎంతో మంది బలయ్యారని విచారం వ్యక్తం చేశారు. కేరళ ఘటనపై ప్రధాని మోదీ మానవతా దృక్పథంతో వ్యవహరించి జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. బంగ్లాదేశ్‌లో అవినీతి, అహంభావం పెరిగిపోయాయని, ప్రజాస్వామ్యాన్ని ప్రధాని షేక్ హసీనా చంపేశారని విమర్శించారు. ఆ దేశ విద్యార్ధులు, ప్రజా సంఘాలు అనుసరిస్తున్న తీరును సమర్ధించిన నారాయణ .. బంగ్లాదేశ్ పరిణామాలు మోదీకి గుణపాఠం కావాలన్నారు. దేశంలోని పలు రాష్ట్రాల గవర్నర్‌లు రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం సీఎం చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడాన్ని స్వాగతిస్తామని నారాయణ పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇస్తే సరిపోదనీ, నిర్వాసితులకు నష్టపరిహారం కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని జగన్ అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో శాంతి భద్రతలను బూతద్దంలో పెట్టి చూడాల్సిన పనిలేదని అన్నారు. అసెంబ్లీకి వెళ్లకుండా జగన్ ఢిల్లీకి ఎందుకు వెళ్లారని నారాయణ ప్రశ్నించారు.
Admin
Studio18 News