Studio18 News - ANDHRA PRADESH / AMARAVATI : రేపు పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు ఐదు జిల్లాలకు పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరిక మిగతా ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడే సూచన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచన ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురవనున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) వెల్లడించింది. దక్షిణ కోస్తాంధ్ర, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆదివారం (అక్టోబర్ 12) రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని స్పష్టం చేసింది. విపత్తుల నిర్వహణ సంస్థ అంచనాల ప్రకారం, రేపు అల్లూరి సీతారామరాజు, ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడవచ్చని అధికారులు అంచనా వేశారు. వర్షాల సమయంలో ఉరుములు, మెరుపులు ఆకస్మికంగా సంభవించే అవకాశం ఉన్నందున, ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశువుల కాపరులు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని హెచ్చరించారు. ఇప్పటికే ఈ ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలోని పలుచోట్ల వర్షపాతం నమోదైందని సంస్థ వివరించింది. గడిచిన 24 గంటల్లో చిత్తూరులో 34.2 మిల్లీమీటర్లు, తూర్పు గోదావరి జిల్లా లక్ష్మీపురంలో 31 మిల్లీమీటర్లు, శ్రీకాకుళం జిల్లా కోర్లాంలో 26.7 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డయినట్లు తెలిపింది.
Admin
Studio18 News