Studio18 News - ANDHRA PRADESH / : ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి..ఎనిమిది నెలలు అయిపోతున్నా.. ఇంకా పదవుల పంపకం పూర్తి కాలేదు. ఖాళీలు తక్కువ ఆశావహులు ఎక్కువ అన్నట్లుగా పరిస్థితి ఉండటంతో..అందరికీ ఛాన్స్ ఇవ్వడం సాధ్యం కావడం లేదు. లేటెస్ట్‌గా భర్తీ అయినా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల్లో ముగ్గురు టీడీపీ నేతలకు అవకాశం దక్కింది. అందులో ఒకరికి రెండోసారి రెన్యూవల్ కాగా..పలు ఈక్వేషన్స్‌తో మరో ఇద్దరికి బెర్తులు దక్కాయి. అయితే ఎమ్మెల్సీ రేసులో ఉన్నారని ప్రచారం జరిగిన నేతల్లో ఎవరికి అధ్యక్షా అనే యోగం దక్కలేదు. మండలికి వెళ్లి ఎమ్మెల్సీ అనిపించుకుందానుకున్న నేతలకు నిరాశే మిగిలింది. ఇప్పుడా నామినేటెడ్ పదవుల రేసు ఊరిస్తోంది. ఏపీలో ఇప్పట్లో ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యేలా లేవు. 2027లో అంటే మరో ఏడాదిన్నర తర్వాత ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అయ్యే అవకాశం ఉంది. మొన్నటి ఆశావహుల్లో చాలామందికి ఇదే మాట చెప్పి ఒప్పించే ప్రయత్నం చేసింది టీడీపీ అధిష్టానం. అయితే పిఠాపురం సీటును త్యాగం చేసి పవన్ గెలుపు కోసం కష్టపడ్డ SVSN వర్మకు ఎమ్మెల్సీ బెర్త్ పక్కా అని ప్రచారం జరిగినప్పటికీ..ఆయనకు బెర్త్ దక్కకపోవడం ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉంది.
ఆయన తీవ్ర అసంతృప్తి చెందినట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే టీడీపీ అధిష్టానం పెద్దలు ఆయనకు టచ్‌లోకి వెళ్లి క్యాబినెట్ ర్యాంకు నామినేటెడ్ పోస్ట్ ఇస్తామని హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. పిఠాపురం వర్మకు క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి ఇస్తారని ఎప్పటి నుంచో అంటున్నారు. వర్మ మాత్రం మొన్నటి వరకు ఎమ్మెల్సీ కావాలనే పట్టుబట్టారట. ఇప్పట్లో ఎమ్మెల్సీలు ఖాళీ అయ్యే పరిస్థితి లేకపోవడంతో వర్మ నామినేటెడ్ పోస్ట్ తీసుకుంటారా లేదా అన్న డైలమా కొనసాగుతోంది. మాజీ మంత్రి దేవినేని ఉమా, బుద్దా వెంకన్న, వంగవీటి రాధా పేర్లు కూడా ఎమ్మెల్సీ రేసులో వినిపించాయి. వాళ్లను మండలికి పంపకపోవడంతో నామినేటెడ్ పదవులు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. 50కి పైగా కీలక కార్పొరేషన్ పదవుల భర్తీ పెండింగ్‌లో ఉంది. అందులో పది టాప్ మోస్ట్ పోస్టులు ఉంటాయని అంటున్నారు. ఆ పదవులను ఎమ్మెల్సీ ఆశించిన నేతలకు ఇస్తారని చెబుతున్నారు. మంత్రి పదవి ఆశించిన పలువురు ఎమ్మెల్యేలకు కూడా కార్పొరేషన్ ఛైర్మన్ పోస్టులు ఇస్తారట. క్యాబినెట్ ర్యాంకు ప్రోటోకాల్ ఉండే బెర్తులను ఇచ్చి సముదాయిస్తారని అంటున్నారు. అయితే ఇందులో కొందరు నేతలు ఎమ్మెల్సీ అయి భవిష్యత్‌లో మంత్రి కావాలని ఆశపడ్డారు. అలాంటి వాళ్లు మాత్రం మరో ఏడాదిన్నర తర్వాత ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ సీట్ల కోసం ఎదురుచూస్తున్నారట. అప్పుడు ఎమ్మెల్సీ ఇస్తామంటే ఇప్పుడు నామినేటెడ్ పదవి వద్దని..మండలికి వెళ్లాలన్నదే తమ కోరిక అని మనసులో మాటను టీడీపీ పెద్దల చెవిలో వేశారట.
అయితే వైసీపీ ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, పోతుల సునీత, బల్లి కల్యాణ చక్రవర్తి, జయమంగళ వెంకటరమణలు రాజీనామాలు ఆమోదం పొందితే మరో నాలుగు ఎమ్మెల్సీలు ఖాళీ కానున్నాయి. కానీ ఆ నలుగురి రాజీనామాలు ఆమోదం పొందేది ఎప్పుడో క్లారిటీ లేదు. మండలి ఛైర్మన్ పరిధిలో ఉన్న ఆ అంశం టీడీపీకి మింగుడు పడటం లేదు. ఎమ్మెల్సీ పదవులు ఆశిస్తున్న నేతల వెయిటింగ్ లిస్ట్ ఎక్కువగా ఉండటంతో ఆ నలుగురి రాజీనామాలు ఆమోదం పొందేలా మండలి ఛైర్మన్‌పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయబోతున్నారట. శాసనమండలి ఛైర్మన్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టాలనే ఆలోచన చేస్తున్నారట. అలా ఎమ్మెల్సీల రాజీనామాలు ఆమోదింపజేసి తమ పార్టీలోని ఆశావహుల ఆశలు నెరవేర్చాలని అనుకుంటుందట టీడీపీ. ఎలాగూ ఎమ్మెల్యే కోటా ఖాళీల్లో అవకాశం దక్కలేదు. వైసీపీ సభ్యుల రాజీనామాలు ఆమోదం పొందితే తమకు అవకాశం వస్తుందని ఎదురు చూస్తున్నారు. అదీ కుదరకపోతే నామినేటెడ్ పోస్టే దిక్కని అనుకుంటున్నారట పలువురు నేతలు. ఇంకొందరు అయితే ఎమ్మెల్సీ కోసం ఎదురుచూసి టైమ్ వేస్ట్ చేసుకునే బదులు ఏదో ఒక పదవి తీసుకుని ప్రభుత్వంలో భాగస్వామి అవడమే బెటర్ అని అనుకుంటున్నారట. ఓ వైపు ఎమ్మెల్సీ హామీని తీసుకుని..ఇప్పుడు నామినేటెడ్ పోస్ట్‌తో సరిపెట్టుకోవాలని అనుకుంటున్నారట. ఎమ్మెల్సీ పదవులు ఆశించిన నేతలకు దక్కే నామినేటెడ్ పోస్టులు ఏంటో చూడాలి మరి.
Admin
Studio18 News