Studio18 News - ANDHRA PRADESH / : YS Jaganmohan Reddy : వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వైయస్సార్‌సీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి, ఆ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యన్నారాయణను ఎంపిక చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లా నాయకుల సమావేశంలో అందరి అభిప్రాయాలు తీసుకున్నారు. అనంతరం బొత్సను ఎమ్మెల్సీ అభ్యర్థిగా జగన్ మోహన్ రెడ్డి ఎంపిక చేశారు. ఈ సమావేశంలో విశాఖ ఉమ్మడి జిల్లా వైసీపీ నేతలతో పాటు.. ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా నేతలతో జగన్ మాట్లాడుతూ.. విశాఖ జిల్లా స్థానిక సంస్థల్లో వైయస్సార్‌సీపీకి భారీ మెజార్టీ ఉన్న నేపథ్యంలో సహజంగా టీడీపీ పోటీకి పెట్టకూడదు. కానీ, చంద్రబాబు ఏరోజూ నైతిక విలువలు పాటించే వ్యక్తి కాదు. రకరకాల ప్రలోభాలు, బెదిరింపులతో అడ్డగోలుగా గెలవడానికి ప్రయత్నిస్తారని జగన్ విమర్శించారు. కుయుక్తులు, కుట్రలు అనేవి చంద్రబాబు నైజం. అధికార పార్టీ నుంచి బెదిరింపులు ఉంటాయి. వాటిని ధీటుగా ఎదుర్కొనేలా అందరూ కలిసి ముందుకు సాగాలని ఉమ్మడి విశాఖ జిల్లా వైసీపీ ప్రజాప్రతినిధులకు జగన్ మోహన్ రెడ్డి సూచించారు. ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంకోసం ఆగస్టు 6న ఉపఎన్నిక నోటిఫికేషన్ విడుదల కానుంది. అదేరోజు నుంచి ఆగస్టు 13వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. ఆగస్టు 30న ఉదయం 8గంటల నుంచి 4గంటల వరకు ఉప ఎన్నిక ఓటింగ్ జరగనుంది. సెప్టెంబర్ 3వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. ఈ ఎన్నికల్లో విశాఖపట్టణం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల పరిధిలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్, మండల పరిషత్ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఎమ్మెల్సీ స్థానంకు మొత్తం 841 ఓట్లు ఉండగా.. వైసీపీకి 615, టీడీపీ, జనసేన, బీజేపీకి కలిపి 215 ఓట్లు ఉన్నాయి. 11 స్థానాలు ఖాళీగా ఉన్నాయి.
Admin
Studio18 News