Studio18 News - ANDHRA PRADESH / : వైసీపీ కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తున్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమని, అలాంటి పోలీసు అధికారుల పేర్లు రాసుకోవాలని పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్వరంతో హెచ్చరించారు. పార్టీ కార్యకర్తలకు అండగా నిలుస్తానని, 'జగన్ 2.0'లో వారికి అత్యంత ప్రాధాన్యత కల్పిస్తానని ఆయన భరోసా ఇచ్చారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో అన్నమయ్య జిల్లా రాజంపేట మున్సిపాలిటీ, చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం, శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మున్సిపాలిటీ, పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలానికి చెందిన ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, మున్సిపల్ చైర్‌పర్సన్లు, వైస్ చైర్‌పర్సన్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలతో పాటు ఆయా జిల్లాల ముఖ్య నేతలతో జగన్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ... కేవలం వైసీపీని ప్రేమించినందుకు, అభిమానించినందుకు కార్యకర్తలు అనేక బాధలు పడుతున్నారని, వారి ఆవేదనను తాను చూస్తున్నానని అన్నారు. "మీ బాధలు చూస్తున్నాను. హామీ ఇస్తున్నాను. ఎవ్వరినీ వదలం. ఎక్కడున్నా సరే, కార్యకర్తల్ని ఇబ్బంది పెడుతున్న పోలీసు అధికారుల పేర్లు రాసుకోండి. అధికారంలోకి వచ్చాక వారిని చట్టం ముందు నిలబెడదాం" అని జగన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం చంద్రబాబు, కొందరు పోలీసులు దుర్మార్గాలకు పాల్పడుతున్నారని, వారు ఏదైతే విత్తనం వేస్తున్నారో, రేపు అదే మొలకెత్తుతుందని జగన్ వ్యాఖ్యానించారు. "ఈరోజు దౌర్జన్యాలు చేస్తున్న అధికారులు, పోలీసులు ఆనాడు ఎక్కడున్నా, రిటైరైనా, సప్త సముద్రాల అవతల ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అది మామూలుగా ఉండదు" అని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతోందని, ప్రశ్నించకూడదనే ఉద్దేశంతో తప్పుడు కేసులు పెడుతున్నారని, తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారని జగన్ ఆరోపించారు. సంబంధం లేని వారిని కూడా కేసుల్లో ఇరికిస్తున్నారని, గతంలో ఇటువంటి రాజకీయాలు ఎప్పుడూ చూడలేదని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు ప్రజల్లో చులకన అయ్యారని, ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని జగన్ విమర్శించారు. ఈ వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే, ఎవరూ ప్రశ్నించకుండా ఉండేందుకు రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా, ప్రజల్లో వ్యతిరేకత కనిపించినా వెంటనే ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతోందని, ఒకరోజు తిరుపతి లడ్డూ వివాదం, మరోరోజు సినీ నటి కేసు అంటూ ప్రజల దృష్టిని పక్కదారి పట్టిస్తున్నారని జగన్ ఆరోపించారు. ప్రజల్లోకి వెళ్లే ధైర్యం టీడీపీ వారికి లేదని, ప్రజలు అడిగే ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నారని అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేయడంతో, పిల్లలు తమ రూ.15 వేలు, రైతులు రూ.26 వేలు, అవ్వలు రూ.48 వేలు, యువత రూ.36 వేలు ఏమయ్యాయని నిలదీస్తున్నారని, దీనికి సమాధానం చెప్పలేని దుస్థితిలో టీడీపీ ఉందని జగన్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను చంద్రబాబు ప్రభుత్వం నాశనం చేసి, నిర్వీర్యం చేసిందని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
Admin
Studio18 News