Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇవాళ కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో బెంగళూరులో సమావేశమయ్యారు. కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ బీ ఖంద్రేతోనూ చర్చలు జరపనున్నారు. చిత్తూరు జిల్లా పరిధిలో, పార్వతీపురం ప్రాంతంలోను ఏనుగులు గ్రామాల్లోకి వస్తూ పంటలు నాశనం చేస్తున్నాయి. అలాగే, స్థానికులకు ఏనుగులు ప్రాణ హాని కలిగిస్తున్నాయి. ఆ ఏనుగులను తిరిగి అడవిలోకి తరిమేందుకు కుంకీ ఏనుగులు అవసరమవుతాయి. కర్ణాటకలో కుంకీ ఏనుగులు ఉండడంతో కొన్నింటిని మన రాష్ట్రానికి ఇచ్చేలా కర్ణాటక అటవీ శాఖను పవన్ కల్యాణ్ కోరనున్నారు. కుంకి ఏనుగుల మనుగడతో పాటు వాటి జీవన విధానంలో మార్పుపై పవన్ చర్చించనున్నారు. అలాగే, ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టడానికి ఇరు రాష్ట్రాల అధికారులు సమన్వయంతో పని చేసేలా కార్యాచరణ రూపొందించుకునే అంశంపై కూడా పవన్ కల్యాణ్ కర్ణాటకతో చర్చలు జరుపుతారు. అటవీశాఖ అధికారులతో చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాగా, ఎర్రచందనం అక్రమ రవాణాలను అరికట్టేలా చర్యలు తీసుకోవాలని కొన్ని వారాలా క్రితమే సంబంధింత అధికారులకు పవన్ కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. పవన్ ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులు ప్రణాళిక బద్దంగా తనిఖీలు చేసుకుంటూ వచ్చారు.
Admin
Studio18 News