Studio18 News - ANDHRA PRADESH / : MPDO Missing Incident : నర్సాపురం ఎంపీడీవో వెంకటరమణారావు ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయన సైబర్ నేరగాళ్ల ఒత్తిడి తట్టుకోలేకనే సూసైడ్ చేసుకున్నాడనే మరొక వాదన కూడా తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఆ దిశగా విచారణ చేశారు. ఎంపీడీవోను బ్లాక్ మెయిల్ చేసిన కీలక నిందితుల్లో ఒకరిని పోలీసులు గుర్తించారు. రాజస్థాన్ బర్కత్ పుర యువకుడిని గుర్తించి మూడు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అనంతపురం జిల్లా సింగణమల పోలీసుల అదుపులో సైబర్ నిందితుడు ఉన్నాడు. సింగణమల పోలీసు స్టేషన్ పరిధిలోని సైబర్ నేరగాళ్లు న్యూడ్ వీడియో కాల్స్ తో బెదిరించారు. ఒక కేసులో విచారణకోసం వెళ్లిన సమయంలో రెండు ఘటనలు వెలుగులోకి వచ్చాయి. వారిని కస్టడీకి తీసుకొని విచారణ జరిపించేదుకు కృష్ణా జిల్లా పోలీసులు సిద్ధమవుతున్నారు. 25 నుంచి 35 మంది వరకు గ్యాంగ్ సభ్యులు సైబర్ మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఏపీ పోలీసుల కదలికలను గుర్తించిన నేరగాళ్లు పరారయ్యారు. పోలీసుల విచారణలో వెలుగులోకి వస్తున్న విషయాలను బట్టిచూస్తే.. వెంకటరమణారావు సైబర్ నేరగాళ్ల ఒత్తిడి తట్టుకోలేకనే ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఈనెల 15న వెంకటరమణారావు మిస్సింగ్ పై ఆయన కుటుంబ సభ్యులు పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ వివాదానికి సంబంధించి గత అధికార పార్టీ నేతలే తన ఇబ్బందులకు కారణమని వెంకటరమణారావు తన కుమారుడికి లేఖ ద్వారా, వాట్సప్ లో సమాచారం ఇచ్చాడు. దీంతో ఆయన మిస్సింగ్ వ్యవహారం పొలిటిక్ టర్న్ తీసుకుంది. ఈ నేపథ్యంలో పోలీసులు ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో డ్రోన్ల సహాయంతో తీవ్రంగా గాలించారు. ఎనిమిది రోజుల తరువాత ఆయన మృతదేహం బయటపడింది. రమణారావు ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారించిన పోలీసులు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఎంపీడీవో ఆత్మహత్య వెనుక సైబర్ నేరగాళ్ల హస్తం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. లక్షల రూపాయలు సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టడంతో వెంకటరమణారావు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. ఆయన్ను పలుమార్లు సైబర్ నేరగాళ్లు బెదిరించినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఒక సైబర్ నేరగాన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు, మిగిలినవారికోసం గాలిస్తున్నారు.
Admin
Studio18 News