Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : తాము గేట్లు ఎత్తేస్తే వైసీపీ పూర్తిగా ఖాళీ అవుతుందని మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ఇద్దరు వైసీపీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావులు ఈరోజు తమ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ నేపథ్యంలో గంటా మాట్లాడుతూ... వైసీపీ మునుగున్న నావ అని గతంలో చెప్పానని... వైసీపీ మునిగిపోయిన నావ అని ఇప్పుడు చెపుతున్నానని అన్నారు. వైసీపీకి ఈ పరిస్థితి రావడానికి ఆ పార్టీ అధినేత జగనే కారణమని గంటా చెప్పారు. త్వరలోనే మిగిలిన ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా వైసీపీని వీడుతారని జోస్యం చెప్పారు. ఇంత జరుగుతున్నా జగన్ లో ఎలాంటి మార్పు లేదని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా జగన్ తన తీరును, వ్యక్తిత్వాన్ని మార్చుకుంటే... వచ్చే ఎన్నికల తర్వాతైనా ఆయనకు ప్రతిపక్ష హోదా వచ్చే అవకాశం ఉంటుందని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు నెలలకే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. జగన్ మానసిక పరిస్థితి బాగోలేదని ఆయన చెల్లెలు షర్మిలే చెప్పారని అన్నారు.
Admin
Studio18 News