Studio18 News - ANDHRA PRADESH / : Gossip Garage : ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఆ కుటుంబానికి ఓ ప్రత్యేక స్థానం… సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదురులేని నేపథ్యం… 40 ఏళ్లుగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజకీయాలను… గత పదేళ్లుగా విజయనగరం జిల్లా పాలిటిక్స్‌ను ఏలుతున్న ఆ కుటుంబానికి ఇప్పుడు కాలం కలిసిరావడం లేదా? అన్న చర్చ జరుగుతోంది. ఒక వైపు పార్టీలో పట్టు కోల్పోతున్న సంకేతాలు… ఇంకోవైపు సొంత కుటుంబంలో విభేదాలు… ఈ రెంటికి మధ్య సొంత నియోజకవర్గంలో క్యాడర్ నుంచి ఎదురుగాలి…. వెరసి ఆ కుటుంబం రాజకీయ భవిష్యత్‌పై ఎన్నో సందేహాలను రేకెత్తిస్తోంది? ఒకప్పుడు ఉత్తరాంధ్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన ఆ కుటుంబం ఫ్యూచర్‌పై రకరకాల చర్చ జరుగుతోంది? కళావెంకటరావుకి మంత్రివర్గంలో బెర్త్ దక్కకపోవడానికి కారణం అదేనా? ఉత్తరాంధ్రలో కీలక నేతల్లో ఒకరు టీడీపీ సీనియర్ నేత కిమిడి కళావెంకటరావు. టీడీపీ ఆవిర్భావంతోనే రాజకీయాల్లోకి వచ్చిన కళా… రాష్ట్ర మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా, టీటీడీ చైర్మన్‌గా ఎన్నో కీలక పదవులు నిర్వహించారు. ఆయన కుటుంబం నుంచి కళా సోదరుడు గణపతిరావు, ఈయన సతీమణి మృణాళిని కూడా ఎమ్మెల్యేలుగా పనిచేశారు. చంద్రబాబు గత ప్రభుత్వంలో మృణాళిని, కళా ఇద్దరూ చెరో రెండున్నరేళ్లు మంత్రిగా వ్యవహరించారు. ఇక వీరి కుటుంబం నుంచే యువనేతలు కిమిడి నాగార్జున, కిమిడి రామ్‌మల్లిక్ నాయుడు పసుపు దళంలో క్రియాశీలంగా పనిచేస్తున్నారు. టీడీపీ అధికారంలోకి ఉన్న ప్రతిసారి కళా కుటుంబం నుంచి ఎవరో ఒకరు మంత్రిగా ఉండేవారు. ఐతే తాజా టీడీపీ ప్రభుత్వంలో కిమిడి కుటుంబానికి చోటు దక్కకపోవడంపై రకరకాల ప్రచారం జరుగుతోంది. అటు పార్టీతోపాటు.. ఇటు కుటుంబంలో చోటు చేసుకుంటున్న పొలిటికల్ డ్రామానే కళావెంకటరావుకి మంత్రివర్గంలో బెర్త్ దక్కకుండా చేసిందా? అన్న సందేహాన్ని రేకెత్తిస్తోంది. టికెట్ ఆశించి భంగపడ్డ కళా సోదరుడి కుమారుడు.. టీడీపీకి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన కళా వెంకటరావు ప్రస్తుతం చీపురుపల్లి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈయన సొంత నియోజకవర్గం పక్కనే ఉన్న రాజాం. ఆ నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడు కావడంతో కళా…. నియోజకవర్గం మారాల్సివచ్చింది. 2014లో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల ఎమ్మెల్యేగా గెలిచిన కళా…. ఈ ఎన్నికల్లోనూ అదే నియోజకవర్గం టికెట్ ఆశించారు. ఐతే, ఆ నియోజకవర్గం బీజేపీకి కేటాయించడంతో కళా చీపురుపల్లి మారాల్సి వచ్చింది. మాజీ మంత్రి బొత్సపై దీటైన అభ్యర్థిగా కళాను రంగంలోకి దింపగా, ఇదే అంశం ఆయన సొంత కుటుంబంలో రచ్చకు కారణమైంది. చీపురుపల్లి ఇన్‌చార్జిగా 2019 నుంచి పనిచేస్తున్న కళా సోదరుడి కుమారుడు నాగార్జున ఈ ఎన్నికల్లో టికెట్ ఆశించారు. గత ఐదేళ్లు నియోజకవర్గంలో పార్టీ క్యాడర్‌ను కాపాడి తన సమర్థతను చాటుకున్నారు. ఐతే యువకుడైన నాగార్జున… బొత్సకు పోటీ ఇవ్వలేరనే ఆలోచనతో కళాను చీపురుపల్లి రప్పించింది టీడీపీ అధిష్టానం. నాగార్జున ప్రాధాన్యం తగ్గించేలా కళా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు.. తన సోదరుడి కుమారుడు ఆశిస్తున్న టికెట్‌ను తనకు కేటాయిస్తున్న విషయాన్ని పెద్దగా పట్టించుకోని కళా… చీపురుపల్లిలో పోటీకి సై అన్నారు. ఈ పరిణామం నాగార్జునకు రుచించకపోయినా, పార్టీ ఆదేశాలకు కట్టుబడి పెదనాన్న విజయానికి కృషి చేశారు. ఐతే ఎమ్మెల్యేగా గెలిచాక… కళా తన కుమారుడు రామ్ మల్లిక్ నాయుడిని చీపురుపల్లి తెరపైకి తేవడంతో నాగార్జున జీర్ణించుకోలేకపోతున్నారని అంటున్నారు. ఈ సారి కాకపోయినా… భవిష్యత్‌లో చీపురుపల్లి తనదేనన్న భరోసాతో నియోజకవర్గంలోనే పనిచేస్తున్న నాగార్జున ప్రాధాన్యం తగ్గించేలా కళా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాగార్జున బదులుగా నియోజకవర్గంతో ఏ సంబంధం లేని రామ్ మల్లిక్‌నాయుడు అన్ని విషయాల్లో జోక్యం చేసుకోవడం పార్టీలో చర్చకు దారితీస్తోందంటున్నారు. సొంత నియోజకవర్గం రాజాంలో మరో విధమైన సమస్య.. ఇలా చీపురుపల్లి నియోజకవర్గంలో సొంత కుటుంబంలోనే సమస్య ఎదుర్కొంటున్న కళా… తన సొంత నియోజకవర్గం రాజాంలో మరో విధమైన సమస్యతో సతమతమవుతున్నట్లు చెబుతున్నారు. రాజాం ఎస్సీ రిజర్వుడుగా మారకముందు ఉణుకూరు నియోజకవర్గంగా ఉండేది. ఈ నియోజకవర్గం నుంచే కళా దాదాపు 30 ఏళ్లు రాజకీయాలు చేశారు. ఐతే రాజాం ఎస్సీ రిజర్వుగా మారిన తర్వాత టీడీపీ ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది. దీనికి కళా కుటుంబమే కారణమన్న ఆరోపణలు గతం నుంచి ఉన్నాయి. ఐతే ఈ ఎన్నికల్లో అవి తొలిసారిగా బహిర్గతమయ్యాయి. ఎమ్మెల్యే కోండ్రుకి కిమిడి కుటుంబం సహకరించలేదని ఫిర్యాదులు.. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో రాజాంలో టీడీపీ ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్‌కు కిమిడి కుటుంబం సహకరించలేదని అధిష్టానికి ఫిర్యాదులు వెళ్లాయి. పైగా కళా సోదరులు వైసీపీ నేతలతో సమావేశం కావడమే కాకుండా, వారికి మద్దతుగా ప్రచారం చేశారని అంటున్నారు. వైసీపీకి చెందిన మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌తో కళా సోదరులు సమావేశం కావడాన్ని రాజాం టీడీపీ క్యాడర్ జీర్ణించుకోలేకపోతోందట. ఈ విషయమై కిమిడి కుటుంబంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కొందరు కార్యకర్తలు ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి సీఎం చంద్రబాబుకు ఫిర్యాదులు చేసినట్లు చెబుతున్నారు. కళా సమకాలీకుల్లో దాదాపు అందరికీ కీలక పదవులు.. ఇటు కుటుంబంలో వారసుల మధ్య పోరు… అటు సొంత నియోజకవర్గంలో క్యాడర్ నుంచి ఎదురుగాలి ఎదుర్కొంటున్న కళా…. అధిష్టానం నుంచి సరైన గుర్తింపు దక్కించుకోలేకపోతున్నారంటున్నారు. దీనికి ఉదాహకరణగా మంత్రివర్గంలో చోటు దక్కకపోవడాన్ని చూపుతున్నారు. తూర్పు కాపు సామాజికవర్గానికి చెందిన కళా… ఉత్తరాంధ్రలో సీనియర్ నేతల్లో ఒకరు. ఆయన సమకాలీకుల్లో దాదాపు అందరికీ ప్రాతినిధ్యం దక్కింది. విశాఖ జిల్లా నుంచి ఎన్నికైన అయ్యన్నకు స్పీకర్ పదవి ఇవ్వగా, అదే జిల్లాకు చెందిన బండారు సత్యానారాయణమూర్తికి బదులుగా ఆయన కుటుంబానికి చెందిన శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడుకి కేంద్ర మంత్రిపదవి…. వరుసకు వియ్యంకుడైన అచ్చెన్నాయుడికి రాష్ట్ర మంత్రి పదవి వచ్చాయి. సందేహాస్పదంగా కళా పొలిటికల్ ఫ్యూచర్.. ఏ పదవీ లేకుండా ఒక్క కళా మాత్రమే మిగిలిపోయారు. దీనికి కారణం ఏమైవుంటనదేది రాజకీయంగా చర్చనీయాంశవుతోంది. మాజీ మంత్రి బొత్స వంటి బలమైన నేతను ఓడించిన కళాకు కచ్చితంగా మంత్రి పదవి వస్తుందని ఆశించగా, ఆయన బదులుగా జూనియర్ నేత కొండపల్లి శ్రీనివాస్‌కు తూర్పు కాపు కోటాలో మంత్రి పదవిని అప్పగించింది టీడీపీ హైకమాండ్. దీంతో కళా పొలిటికల్ ఫ్యూచర్ సందేహాస్పదంగా మారింది. వారసుల మధ్య సయోధ్య కుదర్చలేని పరిస్థితి ఎదురైతే కష్టమేనా? ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ… వరుస సవాళ్లే ఎదురవుతుండటంతో కళా వెంకటరావు ఎలా ముందుకు వెళతారనేది ఆసక్తి రేపుతోంది. తాను ఎమ్మెల్యేగా ఉన్న చీపురుపల్లితోపాటు రాజాంలోనూ పార్టీ పరంగా సమస్యలను చక్కదిద్దితేనే ఆయనకు మళ్లీ పూర్వవైభవం దక్కే పరిస్థితులు ఉంటాయని విశ్లేషిస్తున్నారు పరిశీలకులు. తమ్ముడి కుమారుడు నాగార్జునకు రాజకీయంగా సహకరిస్తూనే తన కుమారుడి భవిష్యత్‌ను తీర్చిదిద్దడం కళా ముందున్న అతిపెద్ద సవాల్ అంటున్నారు. ఈ ఇద్దరి వారసుల మధ్య సయోధ్య కుదర్చలేని పరిస్థితి ఎదురైతే… ఆయన మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం ఖాయమంటున్నారు. చీపురుపల్లి, రాజాం నియోజకవర్గ సమస్యలను చక్కదిద్దితేనే భవిష్యత్.. ఇక సొంత నియోజకవర్గంలోనూ క్యాడర్‌ను మచ్చిక చేసుకోవడం కళాకు అత్యావసరంగా చెబుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజనలో రాజాం జనరల్‌గా మారే అవకాశం ఉంది. ఇప్పటిలా అక్కడ క్యాడర్ వ్యతిరేకిస్తే కిమిడి కుటుంబానికి రాజకీయంగా ఇబ్బందనే టాక్ వినిపిస్తోంది. ఈ పరిస్థితులను ఎలా చక్కదిద్దగలరనేది ఉత్తరాంధ్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.
Admin
Studio18 News