Studio18 News - ANDHRA PRADESH / : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి ప్రశంసలు కురిపించారు. ఏపీ భారీ వర్షాలపై ఆయన స్పందిస్తూ... విజయవాడను వరదలు అతలాకుతలం చేశాయని... వరద బాధితులను ఆదుకోవడానికి 74 ఏళ్ల వయసులో కూడా చంద్రబాబు ఎంతో శ్రమిస్తున్నారని కితాబిచ్చారు. వరద నీటిలో 30 కిలోమీటర్లు పర్యటించి ప్రజల ప్రాణాలను కాపాడిన ఘనత చంద్రబాబుదేనని చెప్పారు. తన అనుభవంతో విపత్తు నుంచి ప్రజలను కాపాడారని కొనియాడారు. మల్లారెడ్డి ఈరోజు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు తిరుమలకు ఆయన అలిపిరి నడక మార్గం గుండా చేరుకున్నారు. ఆయనతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు తిరుమలకు వచ్చారు. మరోవైపు మల్లారెడ్డి పార్టీ మారే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈ అంశంపై ఆయన స్పందిస్తూ... తాను ఏ పార్టీలోకి వెళ్లడం లేదని చెప్పారు. ఒకవేళ వెళ్తే ఆ విషయాన్ని తానే తెలియజేస్తానని చెప్పారు. తెలంగాణను కేసీఆర్, కేటీఆర్ మళ్లీ అభివృద్ధి చేస్తారనే నమ్మకం తనకు ఉందని చెప్పారు.
Admin
Studio18 News