Studio18 News - ANDHRA PRADESH / : వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ మినరల్ డవలప్ మెంట్ కార్పోరేషన్ (ఏపీఎండీసీ) మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహించిన వెంకటరెడ్డిపై వేటు వేసేందుకు ప్రభుత్వం సిద్దమైంది. జగన్ ప్రభుత్వ హయాంలో ఆయనపై అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. గత ప్రభుత్వంలో ఇసుక, బీచ్ శాండ్, బొగ్గు, గనుల వ్యవహారాల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే ఏపీఎండీసీ కార్యాలయాన్ని సీజ్ చేశారు. కార్యాలయంలోని రికార్డులు బయటకు వెళ్లకుండా చర్యలు చేపట్టారు. వెంకటరెడ్డిని సస్పెండ్ చేయాలని ఇప్పటికే గనుల శాఖ సీఎంకు సిఫార్సు చేసినట్లుగా వార్తలు వినబడుతున్నాయి. ఈ క్రమంలో ఆయనపై సస్పెన్షన్ వేటు వేయడంతో పాటు కేసు నమోదు చేయడానికి ప్రభుత్వం సన్నద్దం అవుతోందని అంటున్నారు. 2019లో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత... కోస్ట్ గార్డ్స్ లో అధికారిగా పని చేస్తున్న వెంకటరెడ్డి డిప్యూటేషన్ పై రాష్ట్రానికి రావడంతో ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించింది. అయితే వెంకటరెడ్డి హయాంలో గనుల శాఖలో తీసుకున్న కీలక నిర్ణయాలు అన్నింటిపై ఆ శాఖ ఉన్నతాధికారులు పరిశీలించి నివేదిక రూపొందించారని, సదరు నివేదికను సీఎంఓకు పంపినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఒకటి రెండు రోజుల్లో వెంకటరెడ్డిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం.
Admin
Studio18 News