Studio18 News - ANDHRA PRADESH / Visakhapatnam : విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో పెను ప్రమాదం తప్పింది. ఆదివారం కర్మాగారంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బ్లాస్ట్ ఫర్నెస్ - 2లో సుమారు 300 ట్రక్కుల ద్రవ ఉక్కు నేలపాలైంది. ఫర్నెస్ నుంచి టర్బో ల్యాడిల్ కార్ (టీఎల్‌సీ)లోకి ద్రవ ఉక్కు నింపి, ఎస్ఎంఎస్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తుండగా, ఒక్కసారిగా టీఎల్‌సీకి రంధ్రం పడి ద్రవ ఉక్కు కింద పడిపోయింది. దీంతో మంటలు చెలరేగి కేబుల్స్ కాలిపోయి, ట్రాక్ దెబ్బతింది. అయితే, ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంపై స్టీల్ ఇంటర్ అధ్యక్షుడు పి.వి. రమణమూర్తి, సీఐటీయూ ప్రధాన కార్యదర్శి యు. రామస్వామి స్పందిస్తూ, ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని, నిపుణులైన సిబ్బందితో పనులు చేయించాలని డిమాండ్ చేశారు.
Admin
Studio18 News