Studio18 News - ANDHRA PRADESH / : ఏపీలో వాలంటీర్ల కథ ముగిసిందనే చెప్పుకోవాలి. రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ మనుగడలో లేదని మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను రెన్యువల్ చేయలేదని ఆయన తెలిపారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల ఆ వ్యవస్థ కనుమరుగైపోయిందని అన్నారు. ఎన్నికల సమయంలో వాలంటీర్లకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నించిందని బాలవీరాంజనేయస్వామి తెలిపారు. కానీ, లేని వాలంటీర్లకు జీతాలు ఎలా ఇవ్వాలని ప్రశ్నించారు. వాలంటీర్లు విధుల్లో ఉంటే వారిని కొనసాగించేవాళ్లమని చెప్పారు. 2023 ఆగస్ట్ నుంచి వాలంటీర్ల వ్యవస్థ ఉనికిలో లేదని తెలిపారు. ఎన్నికలకు ముందు వారితో రాజీనామా చేయించారని... ప్రస్తుతం రాష్ట్రంలో వాలంటీర్లు లేరని చెప్పారు. 2023 ఆగస్ట్ వరకు వాలంటీర్లను కొనసాగిస్తూ గత ప్రభుత్వం జీవో ఇచ్చిందని... 2023 సెప్టెంబర్ లో వారిని కొనసాగించే జీవో ఇవ్వలేదని తెలిపారు. వారిని కొనసాగిస్తున్నట్టు జీవో ఇచ్చిఉంటే వారి జీతాలను కూడా పెంచేవాళ్లమని చెప్పారు. అయితే, వాలంటీర్ల వ్యవస్థపై తమకు విశ్వాసం ఉందని ఆయన చెప్పడం గమనార్హం. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో వాలంటీర్ల గురించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ ఆయన ఈమేరకు స్పష్టతనిచ్చారు.
Also Read : సంపన్నుల కోసం ప్రజాస్వామ్యం ఎదురుచూడాల్సిందే.. హర్ష్ గోయెంకా సెటైరికల్ ట్వీట్
Admin
Studio18 News