Studio18 News - ANDHRA PRADESH / : Tirumala Laddu Controversy: తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వివాదంపై వైసీపీ, అధికార ఎన్డీయే కూటమి నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతోంది. తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు ట్విటర్ వేదికగా వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పలు ప్రశ్నలు సంధించారు. జగన్ రెడ్డికి వేంకటేశ్వర స్వామిపై నమ్మకం ఉందా..? లేదా?. నమ్మకం ఉంటే అన్యమతస్థులు సాంప్రదాయం ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాలి. డిక్లరేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ఉండికూడా సాంప్రదాయాన్ని గౌరవించనప్పుడు తిరుమల ఎందుకు వెళ్లాలి? అంటూ జగన్ ను చంద్రబాబు ప్రశ్నించారు. నాడు ప్రజలు జగన్ కు అధికారం ఇచ్చింది ముఖ్యమంత్రిగా.. కానీ, సాంప్రదాయాలకు విరుద్ధంగా పని చేయమని కాదు. ఇదే విషయంపై గతంలో మేము అడిగితే వైసీపీ నేతలు బూతులు తిట్టారని చంద్రబాబు అన్నారు. వైసీపీ హయాంలో ఆంజనేయ స్వామికి చెయ్యి నరికేస్తే బొమ్మే కదా అన్నారు. హనుమంతుడు వారి దృష్టిలో బొమ్మా? వేంకటేశ్వర స్వామి కూడా బొమ్మా..? రాములవారి తలతీసేస్తే ఏముంది ఇంకో విగ్రహం పెట్టుకోవచ్చు కదా అన్నారు. రథం కాలిపోతే.. తేనెటీగలు వచ్చాయని అన్నారు. తిరుమల పోటులో అగ్ని ప్రమాదం జరిగితే ఏమౌతుందని అడిగారు. ఇలా నిర్లక్ష్యంగా ప్రవర్తించి భక్తుల మనోభావాలను వైసీపీ ప్రభుత్వం దెబ్బతీశారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మనందరం ఉండికూడా భగవంతుడికి ఇలా అపరాధం జరిగిందే అనే బాధ. అందుకే భగవంతుడికి అందరం క్షమాపణ చెప్పాలి. ఇక భగవంతుడే చూసుకుంటాడు అది వేరే విషయం. ఏ మతమైనా సరే.. వేరేవారిని చులకనగా చూడటం సరికాదు. అపచారం చేసి అబద్ధాలను నిజాలుగా చేయాలని చూడటం స్వామి ద్రోహం.
Admin
Studio18 News