Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : Manchu Vishnu : : తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డూ తయారీలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వును వాడారన్న అంశంపై దేశ వ్యాప్తంగా కలకలం చెలరేగుతున్న వేళ దీనిపై సినీనటుడు ప్రకాశ్ రాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేరును ప్రస్తావిస్తూ.. ఆయన ఓ సూచన చేశారు. తిరుపతి లడ్డూ ఘటనపై విచారణ జరపాలి.. దోషులను కనుగొని కఠిన చర్యలు తీసుకోవాలని ప్రకాశ్ రాజ్ అన్నారు. ఈ అంశంపై ఆందోళనలను ఎందుకు వ్యాపింపజేస్తున్నారు..? ఈ సమస్యను జాతీయ స్థాయిలో చర్చించుకునేలా చేస్తున్నారని ప్రకాశ్ రాజ్ అన్నారు. మన దేశంలో ఇప్పటికే మతపరమైన ఉద్రిక్తతలు ఉన్నాయి. కేంద్రంలోని మీ స్నేహితులకు ధన్యవాదాలు అంటూ పవన్ కల్యాణ్ ను ఉద్దేశిస్తూ ట్విటర్ లో ప్రకాశ్ రాజ్ పోస్టు చేశారు. ప్రకాశ్ రాజ్ ట్వీట్ కు ‘మా’ అధ్యక్షులు మంచు విష్ణు స్పందించారు. ప్రకాశ్ రాజ్ దయచేసి నిరుత్సాహం, అసహనం ప్రదర్శించవద్దని హితవు పలికారు. తిరుమల లడ్డూ కేవలం ప్రసాదం మాత్రమే కాదు. నాలాంటి లక్షలాది మంది హిందువుల విశ్వాసానికి ప్రతీక. పవిత్రమైన దేవాలయంలో లడ్డూ వివాదంకు సంబంధించి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇప్పటికే కోరారు. ఇలాంటి వ్యవహారంలో మీలాంటి వారు ఉంటే, మతం ఏ రంగు పులుముకుంటుందో? మీ పరిధుల్లో మీరు ఉండండి అని మంచు విష్ణు ప్రకాశ్ రాజ్ కు ట్విటర్ వేదికగా సూచించారు.
Admin
Studio18 News