Studio18 News - ANDHRA PRADESH / : Palaparthi David Raju : ఏపీ మాజీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు కన్నుమూశారు. 66 ఏళ్ల డేవిడ్ రాజు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. డయాలసిస్ చికిత్స కూడా తీసుకుంటున్నారు. హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం 7గంటలకు తుదిశ్వాస విడిచారు. డేవిడ్ రాజు మృతితో ఆయన అనుచరులు, కుటుంబ సభ్యులు దుఖ:సాగరంలో మునిగిపోయారు. 1999లో సంతనూతల పాడు, 2014లో యర్రగొండ పాలెం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీలో సాధారణ కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ఆరంభించారు. ఎంపీటీసీ, జెట్పీటీసి వంటి పదవులు చేపట్టి అంచలంచలుగా ఎమ్మెల్యే స్థాయికి ఎదిగారు. అనంతరం వైసీపీ ఆవిర్బావంతో టీడీపీని వీడి వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో యర్రగొండపాలెం వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలిచి విజయం సాధించారు. 2014లో టీడీపీ అదికారంలోకి రావడంతో 2016లో వైసీపీని వీడి టీడీపీలోకి డేవిడ్ రాజు పిరాయించారు. 2019 ఎన్నికలకు ముందు మళ్లీ టీడీపీని వీడి వైసీపీలో చేరారు. 2024లో వైసీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1958లో ప్రకాశం జిల్లాలోని నాగులుప్పలపాడు, మట్టిగుంటలో పాలపర్తి డేవిడ్ రాజు జన్మించారు. ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ, ఎల్ఎల్‌బీ పట్టా పొందారు. ఆ తర్వాతటీడీపీ నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. డేవిడ్ రాజు మృతిపట్ల సీఎం చంద్రబాబు, మాజీ సీఎం వైఎస్ జగన్, డిప్యూటీ సీఎం పవన్, మంత్రులు, జిల్లా నేతలు సంతాపం తెలియజేశారు. కుటుంబసభ్యులకు కూడా ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాజీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు మృతి బాధాకరమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ఎమ్మెల్యేగా సంతనూతలపాడు, యర్రగొండపాలెం ప్రజలకు విశేష సేవలందించారు. ఏ పదవిలో ఉన్నా ప్రజల కోసం పనిచేశారన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ.. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
Admin
Studio18 News