Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : Gossip Garage : ఐపీసీ బదులు వైసీపీ చట్టాన్ని అమలు చేశారని ఆరోపణలు ఎదుర్కొన్న 16 మంది ఐపీఎస్‌లకు ప్రభుత్వం వెరైటీ శిక్ష విధించింది. ఇప్పటికే పోస్టింగ్‌లు ఇవ్వకుండా వెయిటింగ్‌లో పెట్టిన ప్రభుత్వం… సీనియర్ అధికారులను ఖాళీగా వదిలేస్తే ఎలా అని అనుకుందేమో… ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనట్లు ఓ మెమో జారీ చేసింది. ప్రస్తుతం ఎంతో మంది అధికారులు వెయిటింగ్‌లో ఉన్నప్పటికీ ప్రత్యేకంగా ఓ 16 మందిని గుర్తించి… రోజూ రమ్మని పిలవడమే హాట్‌టాపిక్ అవుతోంది. ఇంతకీ ఈ 16 మందిపై ప్రభుత్వానికి ఎందుకంత కోపం? రోజూ వారిని డీజీపీ ఆఫీసుకు రమ్మని పిలవడం వెనుక రీజనేంటి? ఆ 16మందికి.. ఏ పనీ లేకుండా ఖాళీగా ఉంచడమే శిక్ష.. రాష్ట్రంలో 16 మంది ఐపీఎస్ అధికారులపై ప్రభుత్వం కఠిన చర్యలకు రంగం సిద్ధం చేస్తోందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జూన్‌లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే పోస్టింగ్‌లు ఇవ్వకుండా పక్కన పెట్టిన ఆ 16 మందిని ఖాళీగా ఉంచకుండా వెరైటీగా శిక్షించాలని భావిస్తోంది. వెయిటింగ్‌లో ఉన్నామని ఇళ్లల్లో రెస్ట్ తీసుకోకుండా రోజూ డీజీపీ ఆఫీసుకు వచ్చి వెళ్లాలని మెమో జారీ చేసింది. ఇలా ప్రత్యేకంగా 16 మంది అధికారుల పేర్లు సూచిస్తూ వారు రోజూ డీజీపీ ఆఫీసుకు రావాలని… కచ్చితంగా సాయంత్రం 5 గంటల వరకు డీజీపీ ఆఫీసులోనే అందుబాటులో ఉండాలని ఆదేశించడమే చర్చనీయాంశమవుతోంది. 16 మంది ఐపీఎస్‌లకు ఏ పనీ లేకుండా ఖాళీగా ఉంచడమే శిక్ష అన్నట్లు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడమే పోలీస్ సర్కిల్స్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. ఐబీ చీఫ్‌గా ఉండగా టీడీపీ నేతలను వేధించారనే ఆరోపణలు.. గత ప్రభుత్వంలో హద్దులు మీరి ప్రవర్తించడంతోనే 16 మంది ఐపీఎస్‌లకు వెరైటీ శిక్ష విధించినట్లు అమరావతిలో టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా గత సర్కార్‌లో ఇంటిలిజెన్స్ చీఫ్‌గా వ్యవహరించిన పీఎస్‌ఆర్ ఆంజనేయులుపై సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడానికి రెండు రోజుల ముందే వేటు పడింది. ఈయన ఐబీ చీఫ్‌గా ఉండగా టీడీపీ నేతలను వేధించారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. ప్రభుత్వం మారిన తర్వాత ఆంజనేయులుకు గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. ఆయనను కలిసేందుకు కూడా సీఎం చంద్రబాబు అంగీకరించకపోవడంతో ఆంజనేయులు వీఆర్‌ఎస్‌కు ప్రయత్నించారనే టాక్ వచ్చింది. ఇప్పుడు ఆయనను రోజూ రమ్మని పిలవడం… సీనియర్ ఐపీఎస్‌కు అవమానకరమైన అంశమే అంటున్నారు. చంద్రబాబు అరెస్ట్ సమయంలో అత్యుత్సాహం ప్రదర్శించారని సీరియస్.. ఇక డీజీపీ హోదాలో ఉన్న పీవీ సునీల్‌కుమార్, ఏడీజీపీ హోదాలో ఉన్న ఎన్.సంజయ్ వంటి సీనియర్లు సైతం ప్రభుత్వం హిట్‌లిస్టులో ఉన్నారు. వీరు ప్రస్తుతం వెయిటింగ్‌లో ఉన్నప్పటికీ ఖాళీగా కూర్చోకుండా ఆఫీసుకు రావాలని సూచించడం ద్వారా వారి పట్ల ప్రభుత్వ వైఖరి ఎలా ఉండబోతోందో స్పష్టం చేసినట్లైంది. వీరిలో సునీల్‌కుమార్ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును కస్టోడియల్ టార్చర్‌కు గురిచేశారనే ఆరోపణలు ఎదుర్కొంటుండగా, చంద్రబాబు అరెస్టు సమయంలో అత్యుత్సాహం ప్రదర్శించారని సంజయ్‌పై ప్రభుత్వం కన్నెర్ర చేస్తోంది. అవరసరం లేకపోయినా చంద్రబాబు అరెస్టుపై హైదరాబాద్, ఢిల్లీ వెళ్లి మీడియా సమావేశాలు నిర్వహించడమే సంజయ్‌కు అశనిపాతమైందంటున్నారు. గత ప్రభుత్వానికి మేలు చేశారనే ఆరోపణలు.. ఇక మిగిలిన ఐపీఎస్‌లు కూడా ఏదో ఒక విధంగా గత ప్రభుత్వానికి మేలు చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారే. ఎస్పీలుగా పని చేసిన రిషాంత్‌రెడ్డి, అన్బురాజన్, రఘువీరారెడ్డి, పరమేశ్వరరెడ్డి, జాషువా, కృష్ణకాంత్ పాటిల్‌పైనా ప్రభుత్వం సీరియస్‌గానే ఉంది. వీరెవరికీ సమీపంలో పోస్టింగులు ఇచ్చే పరిస్థితి లేదని ప్రచారం జరుగుతోంది. వీరంతా గత ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు చేయడమే కాకుండా, టీడీపీ నేతలను ఇబ్బంది పెట్టారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఫలితంగా అందరినీ పక్కన పెట్టడమే కాకుండా… రోజూ డీజీపీ ఆఫీసుకు రావాల్సిందిగా సూచించింది. కేసులను ప్రభావితం చేసే అవకాశం ఉందనే అనుమానం.. ఇలా గత ప్రభుత్వంలో ఓ వెలుగు వెలిగిన పోలీసు అధికారులు ఇప్పుడు ప్రభుత్వానికి టార్గెట్‌గా మారారనేది స్పష్టమవుతోందంటున్నారు. ఐతే వీరికి పోస్టుంగులు లేకుండా పక్కన పెట్టినా, గతంలో ఎన్నడూ లేనట్లు రోజూ ఆఫీసుకు రమ్మని పిలవడానికి ఇంకో ముఖ్య కారణం ఉందంటున్నారు. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మద్యం, ఇసుక, గనులు, ఎర్రచందనం, బియ్యం అక్రమ రవాణా వంటి వాటిపై ప్రత్యేక దర్యాప్తునకు ఆదేశించారు. ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్‌పైనా కేసులు నమోదయ్యాయి. ఈ పరిస్థితుల్లో వైసీపీకి అనుకూలంగా ఉన్న అధికారులు బయట ఉంటే ఆయా కేసులను ప్రభావితం చేసే అవకాశం ఉందనే అనుమానంతో అందరినీ డీజీపీ ఆఫీసుకు పిలిపించినట్లు చెబుతున్నారు. మొత్తానికి ఐపీసీ చట్టం బదులు వైసీపీ చట్టాన్ని అమలు చేశారని టీడీపీ ఆరోపించిన పోలీసు అధికారులకు వెరైటీ శిక్ష విధించడంపై విస్తృత చర్చ జరుగుతోంది.
Admin
Studio18 News