Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అవుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర పర్యాటకశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తో ఆయన భేటీ కాసేపటి క్రితం ముగిసింది. సమావేశం ముగిసిన అనంతరం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ... గజేంద్రసింగ్ అంటే తనకు ఎంతో గౌరవం ఉందని చెప్పారు. గతంలో ఆయన జలశక్తి మంత్రిగా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టు కోసం ఎంతగానో సహకరించారని తెలిపారు. ఏపీ పర్యాటక రంగానికి సంబంధించి గజేంద్రసింగ్ కు 7 ప్రాజెక్టులపై ప్రతిపాదనలు అందించామని పవన్ వెల్లడించారు. తమ ప్రతిపాదనలపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని చెప్పారు. గండికోటను ఇండియన్ గ్రాండ్ కేనియన్ లా అభివృద్ధి చేయవచ్చని అన్నారు. రాష్ట్రంలో పర్యాటక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని గజేంద్రసింగ్ ను కోరామని చెప్పారు. మరోవైపు పవన్ కల్యాణ్ ఈరోజు కేంద్ర ఆర్థిక మంత్రి, కేంద్ర జలశక్తి మంత్రి, కేంద్ర రైల్వే మంత్రి, కేంద్ర పంచాయతీ శాఖ మంత్రితో భేటీ కానున్నారు. రేపు పార్లమెంట్ లో ప్రధాని మోదీతో సమావేశం కాబోతున్నారు.
Also Read : 'పుష్ప' నటుడు శ్రీతేజ్‌పై యువతి ఫిర్యాదు.. కేసు నమోదు చేసిన పోలీసులు!
Admin
Studio18 News