Studio18 News - ANDHRA PRADESH / : Gossip Garage : రాజకీయాల్లో పబ్లిక్ పరీక్షలు ఐదేళ్లకోసారి జరుగుతాయి. ప్రతిరోజూ స్లిప్ టెస్టులు ఉంటునూ ఉంటాయి. కానీ, తన నియోజకవర్గంలో ప్రతిరోజూ పబ్లిక్ ఎగ్జామ్ ఎదుర్కొంటున్నారట ఏపీకి చెందిన ఓ మంత్రి. రాజకీయ చైతన్యం కాస్త ఎక్కువ ఉండే నియోజకవర్గం నుంచి గెలవడం ఒక ఎత్తైతే.. అక్కడ రాజకీయాలు మంత్రికి పెను సవాల్ విసురుతున్నాయంటున్నారు. ముగ్గురు బలమైన ప్రత్యర్థులతో ఒకేసారి యుద్ధం చేయాల్సి రావడం ఆ మంత్రికి పొలిటికల్‌గా అడ్వాంటేజ్‌గా మారిందంటున్నారు. మంత్రి సుభాష్ సామర్థ్యానికి పరీక్ష.. ఒక మంత్రి, ముగ్గురు ప్రత్యర్థుల మధ్య యుద్ధానికి వేదిక అవుతోంది రామచంద్రపురం నియోజకవర్గం. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కీలక నియోజకవర్గమైన రామచంద్రపురం నుంచి టీడీపీ నేత వాసంశెట్టి సుభాష్ ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచారు. అమలాపురానికి చెందిన సుభాష్‌కు గత ఎన్నికల్లో అనూహ్యంగా టీడీపీ టికెట్ కేటాయించగా, మంచి మెజార్టీతో గెలిచారు. ఇక గెలిచిన తొలిసారే సుభాష్‌కు మంత్రి పదవి కట్టబెట్టారు సీఎం చంద్రబాబు. రాజకీయంగా చాలా జూనియర్ అయినప్పటికీ యవత కోటాలో సుభాష్‌కు మంత్రి పదవి దక్కడంతో ఆయనపై అంచనాలు ఎక్కువయ్యాయి. ఉమ్మడి జిల్లా నుంచి జనసేనాని పవన్‌తోపాటు సుభాష్ మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ ఎక్కువగా రాజధానిలో ఉండిపోవడం వల్ల ఉమ్మడి జిల్లా వ్యవహారాలన్నీ మంత్రి సుభాష్ చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే సమయంలో తన సొంత నియోజకవర్గం నుంచి సవాళ్లు ఎక్కువ అవడం మంత్రి సుభాష్ సామర్థ్యానికి పరీక్షగా మారింది. రెండు ప్రధాన సామాజికవర్గాల మధ్య ఆధిపత్య పోరు.. రామచంద్రాపురం నియోజకవర్గంలో రెండు ప్రధాన సామాజికవర్గాల మధ్య ఆధిపత్య పోరు ఎక్కువగా ఉంటుంది. జిల్లా రాజకీయాలను ఆ రెండు సామాజిక వర్గాలు ప్రభావితం చేస్తుంటాయి. దీంతో గత 30 ఏళ్లుగా ఈ నియోజకవర్గంలో రెండు ప్రధాన సామాజిక వర్గాలకు చెందిన రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మధ్య ఆధిపత్య రాజకీయం నడిచింది. అయితే 2019 ఎన్నికల తర్వాత ఈ ఇద్దరూ అనూహ్యంగా ఒకే పార్టీలో చేరడంతో వారి మధ్య రాజకీయ యుద్ధానికి పుల్‌స్టాప్ పడింది. మంత్రి సుభాష్‌తో యుద్ధానికి కాలు దువ్వుతున్నారు.. ఇదే సమయంలో గతంలో రామచంద్రాపురం నుంచి ప్రాతినిధ్యం వహించిన మాజీ మంత్రి వేణుతో బోస్‌కు భేదాభిప్రాయాలు ఉండేవి. దీంతో ఈ నియోజకవర్గం ఎప్పుడూ హాట్‌హాట్ రాజకీయాలకు కేరాఫ్‌గా ఉండేవి. బోస్, వేణు కొట్లాటతో గత ఎన్నికల్లో వైసీపీకి నష్టం జరగ్గా.. అనూహ్యంగా టీడీపీ నేత సుభాష్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన స్థానికేతరుడు కావడంతో నియోజకవర్గంలో మళ్లీ తమ పట్టు పెంచుకోవాలని వైసీపీ నేతలు ఎవరికి వారు ప్రయత్నిస్తూ మంత్రికి సవాల్‌గా మారుతున్నారు. కొత్తగా గెలిచిన మంత్రికి కొన్నాళ్లు సమయం ఇచ్చినా, తమ ప్రభావం తగ్గిపోతుందనే ఆలోచనతో ముగ్గురు వైసీపీ నేతలు వేర్వేరుగా పావులు కదుపుతూ మంత్రి సుభాష్‌తో యుద్ధానికి కాలుదువ్వుతున్నారు. దీంతో రామచంద్రాపురం నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. మంత్రి సుభాష్ సమయస్ఫూర్తితో పెను ప్రమాదం తప్పినట్లైంది.. ఇటీవల ఓ ప్రధాన సామాజికవర్గంలో చోటుచేసుకున్న ఓ చిన్న ఘర్షణను పెద్దగా చూపి మంత్రికి చికాకు తెప్పించేలా వైసీపీ పావులు కదపడం చర్చనీయాంశంగా మారింది. మంత్రి సుభాష్ సమయస్ఫూర్తితో వ్యవహరించి ఆ చిన్న తగాదాను పరిష్కరించడంతో పెను ప్రమాదం తప్పినట్లైందంటున్నారు. లేదంటే అదో పెద్ద సామాజిక సమస్యగా మారి మంత్రికి తలనొప్పి తెచ్చేదే అంటున్నారు. ఈ ఒక్క అంశమే కాకుండా మంత్రి సుభాష్ గెలిచిన నుంచి చిన్నచిన్న అంశాలే ఆయనకు పరీక్షగా మారుతున్నాయంటున్నారు. సాధారణ కార్యకర్తగా రాజకీయాలు మొదలుపెట్టిన మంత్రి సుభాష్‌కు అధినేత అండదండగా నిలిచి ప్రోత్సహించినా.. సొంత నియోజకవర్గంలో నెగ్గుకు రాలేకపోతే తన రాజకీయ భవిష్యత్తే ప్రమాదంలో పడే అవకాశం ఉండటంతో మంత్రి నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్ పెట్టారంటున్నారు. నియోజకవర్గంపై ఎక్కువ ఫోకస్.. ప్రత్యర్థులు ముగ్గురు బలమైన నేపథ్యం ఉన్న వారు కావడం, ఆ ముగ్గురిలో ఇద్దరు స్థానికులు కావడంతో వారికి ఎలాంటి అవకాశం ఇవ్వకూడదని భావిస్తున్నారు మంత్రి సుభాష్. మంత్రిగా తన శాఖ వ్యవహారాలు, ఉమ్మడి జిల్లాలో ఏకైక టీడీపీ మంత్రిగా బాధ్యతలతో నిత్యం బిజీగా ఉంటున్న మంత్రికి… సొంత నియోజకవర్గంలో ఎదురవుతున్న సవాళ్లు పరీక్ష పెడుతున్నాయంటున్నారు. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా ప్రత్యర్థులు దూసుకువస్తుండటంతో నియోజకవర్గంపై ఎక్కువ ఫోకస్ చేయాల్సి వస్తోందంటున్నారు. ఈ పరిస్థితులు కత్తిమీద సాములా తయారవడంతో మంత్రి తన మార్కు రాజకీయం రుచి చూపేందుకు సిద్ధమవుతున్నారంటున్నారు. ప్రజలతో నేరుగా సంబంధాలు ఏర్పాటు చేసుకునేలా ప్లాన్.. ఎన్నికల్లో పార్టీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ అండదండలతో సునాయాసంగా గెలిచినా.. ప్రతిరోజూ ఓ రాజకీయ యుద్ధమే చేయాల్సి వస్తుండటంతో ప్రజలతో నేరుగా సంబంధాలు ఏర్పాటు చేసుకునేలా ప్లాన్ చేస్తున్నారు మంత్రి సుభాష్. ఇటీవలే నియోజకవర్గంలో జాబ్‌మేళా నిర్వహించి యువతకు దగ్గరయ్యేలా అడుగులు వేసిన మంత్రి… ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా నేరుగా తనను సంప్రదించాలని… వైసీపీ నేతలను సంప్రదిస్తే ప్రయోజనం ఏం ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. ప్రత్యర్థుల ఎత్తులను పసిగట్టి.. ప్రజలు ఎవ్వరూ వారితో సంప్రదింపులు జరపకుండా చూడటం కోసం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారంటున్నారు. మరోవైపు వైసీపీ నేతల తీరుతో మంత్రి సుభాష్ రాజకీయంగా రాటుదేలుతున్నట్లు చెబుతున్నారు. రాజకీయాల్లో పెద్దగా అనుభవం లేకపోయినా, వరుసగా ఎదురవుతున్న సవాళ్లు మంత్రికి రాజకీయాలు నేర్పుతున్నాయంటున్నారు. మొత్తానికి రామచంద్రాపురంలో జరుగుతున్న రాజకీయ యుద్ధంలో మంత్రి సుభాష్ ఎలా నెగ్గుకు వస్తారన్నదే ఆసక్తికరంగా మారింది.
Admin
Studio18 News