Studio18 News - ANDHRA PRADESH / : అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల రిటైర్మెంట్ వయస్సును 62 ఏళ్లకు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీ చేసింది. రిటైర్మెంట్ అనంతరం ఇచ్చే గ్రాట్యుటీని పెంచింది. దీని ప్రకారం అంగన్వాడీ హెల్పర్లకు రూ.లక్ష, వర్కర్లకు 40 వేల గ్రాట్యుటీ అందనుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా మార్కాపురంలో పర్యటించారు. మార్కాపురంలో నిర్వహించిన మహిళా దినోత్సవంలో పాల్గొని, ఎస్‌హెచ్‌జీ (స్వయం సహాయక బృందాలు) ఏర్పాటు చేసిన స్టాళ్లను చంద్రబాబు పరిశీలించారు. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు ప్రయోజనాలు కల్పిస్తూ విడుదల చేసిన జీవోను అంగన్వాడీ ఉద్యోగులకు చంద్రబాబు నాయుడు అందించారు. కాగా, ఎస్‌హెచ్‌జీ ఉత్పత్తుల గురించి చంద్రబాబు నాయుడు వివరాలను తెలుసుకున్నారు. అలాగే, మహిళలు, చిన్నారులపై నేరాలను నివారించడానికి విమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్‌ను చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. అంతేకాదు, 1.50 లక్షల మంది మహిళలకు ఫ్రీగా కుట్టుమిషన్లు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహిళా ర్యాపిడో డ్రైవర్లను ఆయన ప్రశంసించారు. ఎస్‌హెచ్‌జీలు తమకు వస్తున్న ఆదాయం గురించి వివరాలు తెలిపారు. అరటి వ్యర్థాలతో వారు తయారు చేసిన టోపీని చంద్రబాబు నాయుడు పెట్టుకున్నారు. గుర్రపుడెక్కతో పాటు అరటి, కొబ్బరి వ్యర్థాలతో పీచు తయారీతో ఆదాయం పొందవచ్చని చంద్రబాబు అన్నారు. ఎస్‌హెచ్‌జీలు వీటిపై మరింత తెలుసుకోవాలని చెప్పారు. మహిళలు ఆదాయం సంపాదించుకోవడానికి డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేశామని, ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ఆ సంఘాలు నిలబడ్డాయని అన్నారు. మేజర్ పంచాయతీల్లోనూ అరకు కాఫీ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. మహిళల రక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. ఎవరైనా మహిళల జోలికి వస్తే అదే వారికి చివరి రోజు అవుతుందని వార్నింగ్ ఇచ్చారు.
Admin
Studio18 News