Studio18 News - ANDHRA PRADESH / : ఏపీలోని టీడీపీ కూటమి పాలన సజావుగా సాగకుండా అడ్డుకునేందుకు ఓ పార్టీ ప్రయత్నిస్తోందని, అది ఏ పార్టీనో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని జనసేన పార్టీ సెక్రటరీ జనరల్ నాగబాబు ఆరోపించారు. రాష్ట్రంలో గొడవలు, అల్లర్లు, హింసాత్మక ఘటనల కోసం జిల్లాకు రూ. 10 కోట్ల చొప్పున రాబోయే రెండేళ్ల కాలానికి ఖర్చు పెట్టేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తున్నట్టు తమకు సమాచారం అందిందని పేర్కొన్నారు. జిల్లాకు రూ. 10 కోట్ల చొప్పున మొత్తం రూ. 130 కోట్లు, ఏడాదికి రూ. 1500 కోట్లు అల్లర్లకు ఖర్చు చేసే బదులు ఆ డబ్బును సామాన్యుల సంక్షేమానికి ఉపయోగించి చేసిన పాపాలు కడుక్కోవడానికి ఖర్చు చేసి ఉంటే కొంతలో కొంతైనా సానుభూతి వచ్చేదని, కానీ ఇలా అల్లర్ల ద్వారా మధ్యంతర పాలన వస్తుందన్న పనికిమాలిన ఆలోచనలు మానుకుంటే మంచిదని హితవు పలికారు. ఇలాంటి క్రూరమైన ఆలోచనలు తమదాకా రావని అనుకోవద్దన్నారు. ఇలాంటి వాటిని దీటుగా ఎదుర్కొంటామని తేల్చిచెప్పారు. హింసాత్మక చర్యలకు ఆ డబ్బును ఖర్చు చేసే బదులు దానిని పేదల కోసం ఖర్చు చేస్తే, వారి పురోగతి కోసం ఖర్చు పెడితే ఈసారి ప్రతిపక్ష హోదా అయినా దక్కుతుందని సలహా ఇచ్చారు. ఇది తానిచ్చే సలహా అని, దానిని పాటించాలని, లేకుండా మీ కుట్రలను ఎలా అరికట్టాలో కూటమి ప్రభుత్వానికి తెలుసునని నాగబాబు హెచ్చరికలు జారీ చేశారు.
Admin
Studio18 News