Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : ఏపీలో గురువారం జరిగిన రెండు వేర్వేరు ప్రమాద ఘటనలలో ముగ్గురు మృతి చెందగా, మరి కొందరు గాయపడ్డారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండల పరిధిలో చిత్తూరు – బెంగళూరు జాతీయ రహదారిపై మొగిలి ఘాట్ రోడ్డులో గురువారం వేకువ జామున రెండు లారీలు ఒకదాని వెనుక మరొకటి వెళుతూ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒక లారీకి మంటలు అంటుకుని పూర్తిగా కాలిపోయింది. అందులోని డ్రైవర్ సజీవ దహనం అయ్యాడు. మరో డ్రైవర్ లారీలోనే ఇరుక్కుని మృతి చెందాడు. ఇద్దరు క్లీనర్లు గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జేసీబీ సాయంతో లారీలో ఇరుక్కొని మృతి చెందిన డ్రైవర్ మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మరో ప్రమాదం ఉమ్మడి నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం, చిల్లకూరు జాతీయ రహదారిపై గురువారం వేకువజామున జరిగింది. నిలిపి ఉన్న లారీని వెనుక నుండి వేగంగా వచ్చిన మరో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ క్లీనర్ మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. శ్రీకాళహస్తి నుండి నాయుడుపేటకు లారీ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుడు ఎన్టీఆర్ జిల్లా వెంకటాపురం వాసిగా గుర్తించారు. క్షతగాత్రులను నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Admin
Studio18 News